Vinod Kambli: మళ్లీ హాస్పిటల్లో చేరిన వినోద్ కాంబ్లి.. విషమంగానే మాజీ క్రికెటర్ ఆరోగ్యం
Vinod Kambli: వినోద్ కాంబ్లి మళ్లీ హాస్పిటల్లో చేరాడు. అతని ఆరోగ్యం విషమించడంతో శనివారం (డిసెంబర్ 21) రాత్రి హుటాహుటిన థానేలోని ఆకృతి హాస్పిటల్ కు తరలించారు. సోమవారం (డిసెంబర్ 23) కాస్త నిలకడగానే ఉన్నా.. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వార్తలు వస్తున్నాయి.
Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ మధ్యే తన చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణకు వచ్చిన అతడు.. కాస్త మెరుగ్గానే కనిపించినా గత శనివారం (డిసెంబర్ 21) రాత్రి మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే థానేలోని ఆకృతి హాస్పిటల్ కు తరలించినట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది. గత కొన్నేళ్లుగా కాంబ్లి ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నాడు.
హాస్పిటల్లో వినోద్ కాంబ్లి
ఇండియన్ క్రికెట్ లోకి ఓ మెరుపులా వచ్చి అంతే వేగంగా మాయమైపోయాడు వినోద్ కాంబ్లి. ఆ తర్వాత మందుకు బానిసవడంతో కొన్నేళ్లుగా తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాడు. కనీసం నడవలేని పరిస్థితికి చేరినట్లు కూడా ఆ మధ్య వచ్చిన ఓ వీడియో చూస్తే తెలిసింది. అయితే ఈ మధ్యే ముంబైలో తన చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణకు వచ్చాడు. అక్కడికి సచిన్ టెండూల్కర్ కూడా రావడంతో అతనితో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.
కానీ గత శనివారం మరోసారి అతని ఆరోగ్యం విషమించింది. రెండు రోజులుగా థానేలోని ఆకృతి హాస్పిటల్లో చికిత్స అందిస్తుండగా.. సోమవారం (డిసెంబర్ 23) కాస్త నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని చికిత్సకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
సాయం చేస్తామన్న మాజీ క్రికెటర్లు
వినోద్ కాంబ్లి అనారోగ్యం విషయం తెలియడంతో 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే కాంబ్లి మరోసారి రీహ్యాబిలిటేషన్ కు వెళ్లాలని వాళ్లు సూచించారు. అటు కాంబ్లి కూడా తన అనారోగ్య సమస్యలపై స్పందించాడు. తనకు యూరిన్ సమస్య రావడంతో నెల రోజుల కిందట హాస్పిటల్లో చేరినట్లు తెలిపాడు. "నేను యూరిన్ సమస్యతో బాధపడుతున్నాను.
మూత్రం అలా వస్తూనే ఉంది. నా కొడుకు జీసస్ క్రిస్టియానో నేను మరోసారి నా కాళ్లపై నిలబడేలా చేశాడు. నా పదేళ్ల కూతురు, భార్య కూడా సాయం చేశారు. నెల రోజుల కిందట ఇది జరిగింది. నా తల తిరగడం మొదలైంది. నేను అలా పడిపోయాను. అడ్మిట్ కావాల్సిందిగా డాక్టర్ చెప్పాడు" అని కాంబ్లి వెల్లడించాడు.
2013లోనే కాంబ్లికి రెండు గుండె సంబంధిత సర్జరీలు జరిగాయి. అప్పుడు కూడా అతని స్నేహితుడు సచిన్ టెండూల్కర్ ఆర్థిక సాయం చేశాడు. సచిన్ తనకెంతగానో సాయం చేశాడని, ఆ రెండు సర్జరీలకు అతడే పూర్తి మొత్తం చెల్లించినట్లు కూడా కాంబ్లి చెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి 1992, 1996 వరల్డ్ కప్ లలో ఆడారు. వినోద్ కాంబ్లి ఇండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కూడా అతని సొంతం.