Mythri Movie Makers: సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ సాయం రూ.50 లక్షలు-mythri movie makers sandhya theatre incident puhspa 2 makers gave 50 lakhs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mythri Movie Makers: సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ సాయం రూ.50 లక్షలు

Mythri Movie Makers: సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ సాయం రూ.50 లక్షలు

Hari Prasad S HT Telugu
Dec 23, 2024 05:16 PM IST

Mythri Movie Makers: పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే అభిమాని మరణించిన విషయం తెలుసు కదా. మొత్తానికి 20 రోజుల తర్వాత ఇప్పుడు బాధిత కుటుంబానికి ఈ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు సాయం చేసింది.

సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ సాయం రూ.50 లక్షలు
సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ సాయం రూ.50 లక్షలు

Mythri Movie Makers: సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అండగా నిలిచారు. సోమవారం (డిసెంబర్ 23) ఆ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించారు. అంతేకాదు హాస్పిటల్ కు వెళ్లి రేవతి భర్తకు చెక్కు అందజేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.

yearly horoscope entry point

మైత్రీ మూవీ మేకర్స్ సాయం

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో వేసిన విషయం తెలుసు కదా. ఈ మూవీ చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోగా.. ఆమె తనయుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడా బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు అందించింది. చిన్నారి చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి చెక్కు అందజేశారు.

నిర్మాతలు నవీన్, రవిశంకర్ హాస్పిటల్ కు వెళ్లారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలోనే మృతురాలి భర్తకు చెక్కు అందించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని, జరిగిన రోజు నుంచే తాము చాలా బాధిపడినట్లు ఈ సందర్భంగా వాళ్లు చెప్పారు. గాయపడిన బాబు కోలుకుంటున్నాడని, అతని కోసం డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కూడా తెలిపారు. అటు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఏ11 నిందితుడిగా బన్నీ ఇప్పటికే జైలుకు కూడా వెళ్లి బెయిలుపై వచ్చాడు. కానీ ఇప్పటికీ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ చేసిన తప్పిదమేంటో చెప్పడం, ఆ తర్వాత పోలీసులు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ వీడియో రిలీజ్ చేయడం.. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓయూ విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహించడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

అల్లు అర్జున్ కూడా ఇప్పటికే ఈ వివాదంపై ప్రెస్ మీట్ పెట్టి తన వివరణ ఇచ్చాడు. అసలు రేవతి చనిపోయిన విషయం పోలీసులు తనకు చెప్పలేదని, మరుసటి రోజే తెలిసిందని అతడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వివాదం నేపథ్యంలో ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సినిమా ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సంధ్య థియేటర్ ఘటన అనుకున్నదాని కంటే ఎక్కువ దుమారమే రేపుతున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు రూ.50 లక్షల సాయం అందేజేయడం గమనార్హం.

Whats_app_banner