Allu Arjun : టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు-congress leaders targeted allu arjun in sandhya theatre issue brs bjp supporting tollywood ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allu Arjun : టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు

Allu Arjun : టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు

Bandaru Satyaprasad HT Telugu
Dec 22, 2024 03:52 PM IST

Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సిని పరిశ్రమ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్నారు.

టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు
టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు

Allu Arjun : అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. అనంతరం హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఈ వివాదంలో అల్లు అర్జున్, సినీ పరిశ్రమ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. హీరో అల్లు అర్జున్‌ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేశారని సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్‌ టీమ్‌ ఒప్పుకోలేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టేలా సినీ హీరో అల్లు అర్జున్‌ వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు దారుణంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో ఆయన స్పందించారు. అల్లు అర్జున్‌లో తన చర్యలకు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడంలేదన్నారు. రేవతి కుటుంబంపై సానుభూతి చూపించలేదన్నారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సభలో తెచ్చిన ప్రస్తావనపైనే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌లో షో చేశారన్నారు. ప్రాణాల కంటే పేరు ప్రతిష్ఠలు ఎక్కువా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

సినీ పరిశ్రమ మళ్లీ చెన్నైకి

హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విషాద ఘటన జరిగిన రోజే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటే బాగుండేదన్నారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతిచెందడం, బాలుడు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం, సినీ పరిశ్రమ మద్దతుగా ఉండాలని డిమాండ్‌ చేశారు. అల్లు అర్జున్‌ పై కేసుపెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడారని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ప్రముఖులు మళ్లీ చెన్నైకి వెళ్లాలని చర్చించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమపై సీఎం పగబట్టారు- బండి సంజయ్

సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌ రెడ్డి పగబట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. హీరో అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. బాలుడు శ్రీతేజ్‌ కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారన్నారు. అయితే ఎంఐఎంతో కలిసి సినిమా లెవల్‌లో సీఎం రేవంత్ స్టోరీ అల్లారని విమర్శించారు. సమస్య ముగిసిన తర్వాత కూడా సీఎం అసెంబ్లీలో మళ్లీ దీని గురించి మాట్లాడడం సరికాదన్నారు. సినీ ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. అసెంబ్లీలో గురుకుల విద్యార్థుల మరణాలపై సీఎం ఎందుకు స్పందించలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు.

Whats_app_banner

సంబంధిత కథనం