Allu Arjun: సోషల్ మీడియాలో ‘అల్లు అర్జున్ అరెస్టెడ్’ మళ్లీ ట్రెండింగ్.. మద్దతుగా, వ్యతిరేకంగా పోస్టుల వెల్లువ
Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందనేలా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. అసెంబ్లీ వేదికగా మరిన్ని కామెంట్లు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జున్ ప్రెస్‍మీట్ పెట్టి మరీ అన్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా బెనెఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4 జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు అల్లు అర్జున్. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే, తాజాగా అసెంబ్లీలో శనివారం (డిసెంబర్ 21) ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. థియేటర్ వద్ద అల్లు అర్జున్ చర్యల వల్లే తొక్కిసలాట జరిగిందనేలా మాట్లాడారు. వీటికి అల్లు అర్జున్ కూడా శనివారమే ప్రెస్‍మీట్‍లో వివరణ ఇచ్చారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనుకోని ప్రమాదమేనని అల్లు అర్జున్ చెప్పారు. తాను ర్యాలీ చేశానని అనడం తప్పు అని అన్నారు. తన క్యారెక్టర్‌ను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. మహిళ చనిపోయిన విషయం తర్వాతి రోజు తనకు తెలిసిందని అన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) మళ్లీ ‘అల్లు అర్జున్ అరెస్టెడ్’ (#AlluArjunArrested) అనే హ్యాష్ ట్యాగ్ నేడు ట్రెండ్ అవుతోంది.
మద్దతుగా, వ్యతిరేకంగా..
రేవంత్ రెడ్డి కామెంట్లు, అల్లు అర్జున్ వివరణ తర్వాత సోషల్ మీడియాలో తొక్కిసలాట ఘటనపై మళ్లీ జోరుగా చర్చ సాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అల్లు అర్జున్‍కు మద్దతు తెలుపుతూ కొందరు, ఆయనను వ్యతిరేకిస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను కొందరు సమర్థిస్తున్నారు.
సోషల్ మీడియాలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా పోస్టులు కనిపిస్తున్నాయి. పోలీసులు చెప్పినా థియేటర్ నుంచి ముందుగా అల్లు అర్జున్ బయటికి పోలేదని, వెళ్లిన తర్వాత కూడా ర్యాలీ చేశారని, అందుకే తొక్కిసలాట జరిగిందనేలా రేవంత్ రెడ్డి అన్నారు. అరెస్టు తర్వాత సినీ ప్రముఖులు అల్లు అర్జున్‍ను పరామర్శించడంపై కూడా ఆగ్రహించారు. అయితే తాను బాధ్యతాయుతంగానే వ్యవహరించానని, ప్రమాదవశాత్తు తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ చెప్పారు. తాను ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో చర్చ ఎక్కువగా సాగుతోంది. నిజం ఏదంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
వీడియోలు వైరల్
రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్దతు ఇస్తున్న వారు, వ్యతిరేస్తున్న వారు వాదనలను సమర్థిస్తూ వివిధ వీడియోలు పెడుతున్నారు. కామెంట్లను పోల్చి చూస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన, ఇప్పటి వరిస్థితులను సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ అంశం మరోసారి తీవ్రమైన చర్చకు దారి తీసింది. మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.
మరోవైపు, ఇకపై సినిమాలకు బెనిఫెట్ షోలకు అనుమతి ఇవ్వబోమనేలా సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. టికెట్ ధరల పెంపునకు కూడా కొన్ని రూల్స్ వర్తిస్తాయనేలా, సందేశాత్మక, చారిత్రక చిత్రాలకే అందుకు అనుమతిస్తామనేలా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.
సంబంధిత కథనం