Human Trafficking : విశాఖలో అమ్మాయిల అక్రమ రవాణా గుట్టురట్టు - 11 మందికి విముక్తి...! వెలుగులోకి కీలక విషయాలు
విశాఖపట్నంలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు అయింది. రైళ్లలో తరలిస్తున్న 11 మంది అమ్మాయిలకు విముక్తి కలిగింది. వీరిని తరలిస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం రైల్వే పోలీసులకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగి అనుమానంతో 11 మంది అమ్మాయిలను గుర్తించారు.
మానవ అక్రమ రవాణా ముఠా గుట్టును విశాఖ రైల్వే పోలీసులు రట్టు చేశారు. శనివారం విశాఖ రైల్వే స్టేషన్‌లో రైళ్ల ద్వారా బాలికలు, యువతలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి 11 మందికి విముక్తి కల్పించారు. విశాఖపట్నం రైల్వే సీఐ ధనుంజయనాయుడు వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి బాలికలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం విశాఖ రైల్వే పోలీసులు అందింది. దీంతో రైల్వే పోలుసులు అప్రమత్తం అయ్యారు. అక్రమ రవాణాపై పోలీసులు రంగంలోకి దిగి, గాలింపు చర్యలు చేపట్టారు.
నకిలీ ఆధార్ కార్డులు…!
ఒరిస్సాలోని నవరంగపూర్ నుంచి కోరండల్ రైలులో బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్థారణకు వచ్చారు. 11 మంది బాలికల, యువతులను గుర్తించి అనుమానంతో విశాఖ రైల్వే స్టేషన్‌లో పోలీసులు దింపారు. దీంతో అక్రమ రవాణా విషయం బయటపడింది. వీరిని తిరుపూర్‌లోని బట్టల దుకాణంలో పనిచేసేందుకు తరలిస్తున్నట్లు చెప్పారు. అందుకుగాను వీరందరికి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు 11 మందికి విముక్తి కల్పించారు. వీరిని తరలిస్తున్న ముఠా సభ్యుడి రవి కుమార్ బిసార్‌ను అరెస్టు చేశారు.
రైల్వే పోలీసులు విముక్తి కల్పించిన 11 మందిలో తొమ్మిది మంది బాలికలు, ఇద్దరు యువతులు ఉన్నారు. వీరందరిని రవి కుమార్ బిసార్ అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిపై అక్రమ రవాణా, ఆధార్ ట్యాంపరింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్న కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో కీలక సభ్యులు పెద్దస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రవి కుమార్ బిసార్ ఇప్పటి వరకు వంద మందికి పైగా బాలికలను అక్రమ రవాణ చేసినట్లు తెలిపారు.
విముక్తి గలించిన తొమ్మిది మంది బాలికలు, ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. వారిని అన్ని ప్రక్రియలు ముగిసిన తరువాత వారివారి ప్రాంతాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది. అమాయకత్వం, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ఇలా బాలికలను, యువతులను అక్రమంగా తరలిస్తున్నారు. వారికి డబ్బుల ఆశ చూపి ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడేమో ఉపాధి అని చెబుతారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత వారితో అనేక ఇతర పనులు చేయిస్తారు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం