AP TG Weather Updates : బలహీనపడిన వాయుగుండం - ఏపీలో మరో 2 రోజులు వర్షాలు..! రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం… తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీంతో ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 23వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం… శనివారం రాత్రి తర్వాత బలహీనపడింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇవాళ సాయంత్రం కల్లా పూర్తిగా సముద్రంలోనే బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే దీని ప్రభావం ఇవాళ ఉదయం వరకూ ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాలపై ఉంటుందని పేర్కొంది.
ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కూడా ఆయా జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అంచనా వేసింది.
ఇవాళ కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఇక రేపు కూడా కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సీఎం సమీక్ష…!
భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్షించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎంకు వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎంకు తెలియజేశారు.
భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు, స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాలు తగ్గాక పంట నష్టంపై వివరాలు సేకరిస్తామన్నారు. రైతులకు తక్షణ సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులు చేరేలా చూడాలన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
రేపట్నుంచి తెలంగాణలో వర్షాలు…!
తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ పొడి వాతవరణం ఉంటుందని తెలిపింది. అయితే డిసెంబర్ 23 తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. డిసెంబర్ 27వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలుచోట్ల పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
ఇక ఇవాళ ఉదయం పలు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల పొగమంచు తీవ్రత ఉంటుందని హెచ్చరించింది.