Telugu Family Guinness Records : ఫ్యామిలీ అంటే ఇదేనయ్యా...! నలుగురికీ ‘గిన్నిస్' రికార్డులు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ ఫ్యామిలీ… ప్రస్తుతం చైనాలో ఉంటుంది. భర్త, భార్య, కుమార్తె, కుమారుడు… ఇలా నలుగురు కూడా వారి రంగాల్లో రాణిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. వీరి రికార్డులను చూసిన నెటిజన్లు… ప్రశంసలు గుప్పిస్తున్నారు.
గిన్నిస్ రికార్డుల 'కుటంబం' (Image source from Vijay KonathalaFB)
ఆ ఫ్యామిలీది ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి. ప్రస్తుతం చైనాలో నివసిస్తోంది. ఇంట్లో మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ తక్కువ కాదు…! ఏకంగా నలుగురికి నలుగురు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. యోగా, క్రీడల విభాగాల్లో ఈ ఘనత సాధించింది. ఈ కుటుంబం చైనాలోని చాంగ్‌షా నగరంలో నివసిస్తోంది.
- ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన కుటుంబ పెద్ద కొణతాల విజయ్ 2012 నుండి చైనాలో నివసిస్తున్నారు. అతను యోగా టీచర్ మరియు కొరియోగ్రాఫర్. అతను చైనాలో యోగా మరియు డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడు. 2021లో యోగా విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
- అష్టావక్రాసనం, మయూరాసనం, బకాసనం వంటి ఆసనాలతో సహా సుదీర్ఘమైన యోగా సెషన్‌గా నిర్వహించిన వ్యక్తిగా విజయ్ రికార్డును కలిగి ఉన్నాడు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కాడు.
- విజయ్ భార్య… కొణతాల జ్యోతి గర్భం దాల్చిన 9వ నెలలో (ప్రసవానికి 5 రోజుల ముందు) యోగా భంగిమలను ప్రదర్శించి ప్రపంచ రికార్డును నమోదు చేసింది.కూర్మాసనాన్ని ఏకధాటిగా 10 నిమిషాలు వేసి గిన్నిస్ రికార్డులో తన పేరు నమోదు చేసుకుంది. సుదీర్ఘమైన యోగా సెషన్‌ను నిర్వహించడంలోనూ జ్యోతి రికార్డు సృష్టించింది.
- విజయ్-జ్యోతి దంపతుల 14 ఏళ్ల కుమార్తె కొణతాల జస్మిత ఒక నిమిషంలో ఒకే కాలుపై అత్యంత వేగంగా రోప్ స్కిప్ చేసిన రికార్డును సొంతం చేసుకుంది. జూన్ 1, 2024వ తేదీన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈవెంట్ ఒకే నిమిషంలో 168 స్కిప్‌లతో రికార్డు సృష్టించింది.
- వీరి ఐదేళ్ల కుమారుడు కొణతాల శంకర్ కూడా గిన్నిస్ రికార్డు సాధించాడు. ట్రాంపొలిన్‌పై ఎగురుతూ నిమిషానికి 129 సార్లు స్కిప్పింగ్ చేసి ఈ ఏడాది నవంబరులో రికార్డు సాధించారు. అక్టోబర్ 31, 2024న చైనాలోని చాంగ్‌షాలో జరిగిన పోటీలో అతను ఈ రికార్డు సాధించాడు.
కుటుంబం మొత్తం కూడా గిన్నిస్ రికార్డులు సాధించటం పట్ల పలువురు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. ఫ్యామిలీ అంటే మీదేనయ్యా అంటూ రాసుకొస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పేరును నిలబెట్టడంపై ప్రశంసిస్తున్నారు.
సంబంధిత కథనం