Chiranjeevi: 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూవ్స్.. గిన్నిస్ ప్రపంచ రికార్డు చిరంజీవి కైవసం.. మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్‌గా..
Chiranjeevi Guinness World Records: గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ రంగంలోనే అత్యంత ప్రముఖమైన నటుడిగా, డ్యాన్సర్‌గా గిన్నిస్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ మొమెంటో అందించారు.
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన ఘనత దక్కింది. గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో ఆయనకు చోటు దక్కింది. ఘనమైన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న చిరూకు మరో గౌరవం కైవసం అయింది. తన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు రిలీజై సరిగ్గా 46 పూర్తయిన నేడే (సెప్టెంబర్ 22) చిరంజీవి గిన్నిస్ అవార్డు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా అగ్ర హీరోగా కొనసాగుతూ భారత సినీ ఇండస్ట్రీలో ఒకానొక దిగ్గజంగా, అత్యంత స్టార్‍డమ్ దక్కించుకున్న చిరంజీవి.. ఇప్పుడు గిన్నిస్ బుక్‍లోకి ఎక్కారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
భారత ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖ స్టార్‌గా..
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకటించే ఈవెంట్ హైదరాబాద్‍లో నేడు (సెప్టెంబర్ 22) జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హాజరయ్యారు. చిరంజీవి ప్రపంచ రికార్డుపై గిన్నిస్ ప్రతినిధి మాట్లాడారు. భారత సినీ చరిత్రలో అత్యంత ప్రముఖమైన (ప్రొలిఫిక్) నటుడిగా, డ్యాన్సర్‌గా చిరంజీవిని గుర్తిస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రజెంటేషన్ అందించారు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఇండియాలో మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్స్ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ రికార్డుల్లో చిరూ చోటు దక్కించుకున్నారు. ఈ వేడుకకు నిర్మాత అల్లు అరవింద్, మెగా యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.
24,000 డ్యాన్స్ మూవ్స్
156 సినిమాల్లో 537 పాటల్లో చిరంజీవి 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రొలిఫిక్ నటుడిగా, డ్యాన్సర్‌గా అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకే ఇది గర్వకారణంగా నిలిచింది. చిరూకు సమానంగా దేశంలో కొందరు మంచి నటులు ఉన్నా.. ఆయనలా గ్రేస్, స్టైల్‍తో డ్యాన్స్ చేసే వారు లేరనడంలో అతిశయోక్తి లేదు. యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్, గ్రేస్, స్వాగ్‍తో అదరగొట్టే మెగాస్టార్‌ను అందుకే ఆల్‍రౌండర్ అని పరిగణిస్తుంటారు. గత తరంలో ఇండియన్ సినిమాల్లో డ్యాన్స్ తీరునే చిరూ మార్చేశారు. విభిన్న రకాల డ్యాన్సులను పరిచయం చేశారు. ఇప్పటికీ సినిమాల్లో యువ నటులకు ఏ మాత్రం తగ్గని విధంగా చిరూ డ్యాన్స్ అదరగొడుతున్నారు.
ఊహించలేదు
ఈ ఈవెంట్‍లో చిరంజీవి మాట్లాడారు. తనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుందని ఊహించలేదని చెప్పారు. గిన్నిస్‍కు బుక్‍కు తనకు సంబంధం ఏముంటుందని తాను అనుకున్నానని తెలిపారు. తాను ఎదురుచూడని గొప్ప గౌరవం లభించినందుకు భగవంతుడికి, దర్శకనిర్మాతలకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చిరంజీవి అన్నారు. భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ను చిరూ ఈ ఏడాదే అందుకున్నారు.
చిరంజీవి తనను అడగకూడదని, ఆదేశించాలని బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చెప్పారు. ఈ ఈవెంట్‍కు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిరంజీవి డ్యాన్స్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు ఆమిర్.
చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర చేస్తున్నారు. ఈ చిత్రానికి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.