Formula E Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం - కూపీ లాగుతున్న ఈడీ..!
ఫార్ములా ఈరేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచే పనిలో పడ్డాయి. ఓవైపు ఏసీబీ… కీలక దస్త్రాలను సేకరిస్తుండగా… మరోవైపు ఈడీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం నుంచి ఈడీ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసులో ఉన్న వారికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఫార్ములా ఈరేస్ వ్యవహారం ఏసీబీ చేతుల్లోకి వెళ్లటంతో దర్యాప్తు స్పీడప్ కానుంది. ఆ దిశగా ఏసీబీ అధికారులు అడుగులు వేస్తున్నారు. అవసరమైన కీలక పత్రాలు, సంబంధిత ధ్రువపత్రాలను సేకరించే పనిలో పడింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబట్టి… తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.
ప్రాథమికంగా ఏసీబీ కొన్ని కీలక అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు? నిధులు చెల్లింపు..? ఎలా చేశారనే దానిపై వివరాలను సేకరిస్తోంది. ఆదేశాలు ఎక్కడ్నుంచి వచ్చాయి..? ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై లోతుగా పరిశీలిస్తోంది. అవసరమైతే ఉద్యోగుల వాంగ్ములాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈకేసులో ఉన్న వారికి నోటీసులు జారీ చేసి… విచారించేందుకు రంగం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నోటీసుల జారీకి ఈడీ సిద్ధం…!
ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వటంతో… సీన్ మారే అవకాశం ఉంది. ప్రధానంగా… హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచిఎఫ్‌ఈవో సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది . ఈ వ్యవహారంలో ఫెమా, పీఎంఎల్‌ఏ చట్టాల ఉల్లంఘనలపై విచారించనుంది. ఆర్బీఐ అనుమతులు లేకుండా నిధులు బదిలీతో పాటు పన్ను మినహాయింపు వంటి అంశాలపై కూపీ లాగే అవకాశం ఉంది.
సోమవారం నుంచి ఈడీ దర్యాప్తు షురూ అయ్యే అవకాశం ఉంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ లోని సమాచారమే మాత్రం కాకుండా… నేరుగా కూడా మున్సిపల్ శాఖ నుంచి కొంత సమాచారం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఆరా తీసే అవకాశం ఉంది.
కేసులో ఉన్న కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా ఈడీ నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. వీరందర్నీ విచారించి… మరికొన్ని విషయాలపై స్పష్టత తీసుకోవచ్చని సమాచారం. కేవలం విచారణతోనే విషయం ఆగుతుందా..? లేక మరేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది ఉత్కంఠగా మారింది.
ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. కేటీఆర్ పై 13(1)(ఏ) రెడ్‌విత్, 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్‌విత్, 120(బి) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు విధించారు. రూ. 55 కోట్లను విదేశీ కంపెనీకి(ఫార్ములా ఈరేస్) చెల్లించటంలో అక్రమాలు జరిగాయని ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి.
ఇప్పటికే ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్ఖానం ఆదేశించింది. మరోవైపు ఏసీబీ విచారణ జరపవచ్చని సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 27వ తేదీన జరగనుంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పిటిషన్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం