Bhimavaram Crime : చెక్క పెట్టెలో మృతదేహం.. అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో.. ఆ చేతిరాత ఎవరిది?-police investigation in ap and telangana into the case of a body in a wooden box ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bhimavaram Crime : చెక్క పెట్టెలో మృతదేహం.. అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో.. ఆ చేతిరాత ఎవరిది?

Bhimavaram Crime : చెక్క పెట్టెలో మృతదేహం.. అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో.. ఆ చేతిరాత ఎవరిది?

Basani Shiva Kumar HT Telugu
Dec 22, 2024 03:19 PM IST

Bhimavaram Crime : చెక్క పెట్టెలో డెడ్ బాడీ డెలివరీ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బాడీ ఎవరిది.. ఎవరు పంపారు.. ఎందుకు పంపారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో ఓ వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఎవరు.. అతనిపై అనుమానాలు ఎందుకో ఓసారి చూద్దాం.

చెక్క పెట్టెలో డెడ్ బాడీ డెలివరీ కేసు
చెక్క పెట్టెలో డెడ్ బాడీ డెలివరీ కేసు

ఉండి మండలం యండగండి గ్రామానికి చెక్క పెట్టెలో శవం వచ్చింది. ఈ ఘటనలో మృతుడెవరనేది అంతుచిక్కడం లేదు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు ఏపీ, తెలంగాణలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో శ్రీధర్‌వర్మ అనే వ్యక్తిని ప్రధాన అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. అతను దొరికితే ఈ కేసులో చిక్కుముడులన్నీ వీడిపోతాయని పోలీసులు భావిస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో..

చెక్కపెట్టెలో వచ్చిన మృతదేహం ఎవరిదో గుర్తించే దిశగా ఏపీ, తెలంగాణలో 35నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు అదృశ్యం కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. తులసి కుటుంబానికి మృతుడితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నిందితుడికి మరికొందరు సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పక్కా ప్లాన్‌తో..

చెక్క పెట్టెలో శవం కేసులో ప్రధాన అనుమానితుడు శ్రీధర్‌ వర్మకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భార్య కాళ్ల గ్రామంలో ఉంటున్నారు. రేవతి రెండో భార్య. ఈమెతో మొగల్తూరులో ఉంటున్నారు. అయితే.. రేవతితో పెళ్లి ఫొటోలు మినహా.. ఇతర ఆధారాలు దొరకకుండా చేయడం వెనుక ముందస్తు ప్లాన్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీధర్ సిమ్‌ కార్డులతో పాటు సెల్‌ఫోన్లను కూడా మార్చేస్తుండటంతో ఆచూకీ దొరకడంలేదని తెలుస్తోంది.

ఆస్తి కోసమా..

యండగండి గ్రామానికి చెందిన ముదునూరి రంగరాజు- హైమావతికి సంబంధించిన వ్యవసాయ భూమి, ఇల్లు, ఆస్తుల విషయంలో వారి కుమార్తెలు తులసి, రేవతి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆ ఆస్తిపై కన్నేసిన మరిదే.. వదిన తులసిని బెదిరించేందుకు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెక్క పెట్టెలో లభ్యమైన లేఖలో.. హ్యాండ్ రైటింగ్ ఈ అనుమానాలను బలపరుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి తులసి, ఆమె తల్లిదండ్రులు, సోదరి రేవతి, శ్రీధర్‌ వర్మ తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలో గుర్తించిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పోలీసులు చెబుతున్నారు.

Whats_app_banner