TG Cotton Purchase: స్తంభించిన పత్తి కొనుగోళ్ళు, సీసీఐ నిబంధనలు సడలించాలని పత్తి వ్యాపారులు డిమాండ్-cotton traders demand relaxation of cci norms cotton purchases halted ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cotton Purchase: స్తంభించిన పత్తి కొనుగోళ్ళు, సీసీఐ నిబంధనలు సడలించాలని పత్తి వ్యాపారులు డిమాండ్

TG Cotton Purchase: స్తంభించిన పత్తి కొనుగోళ్ళు, సీసీఐ నిబంధనలు సడలించాలని పత్తి వ్యాపారులు డిమాండ్

HT Telugu Desk HT Telugu
Nov 12, 2024 07:45 AM IST

TG Cotton Purchase: తెలంగాణలో పత్తి కొనుగోలు స్తంభించాయి. జిన్నింగ్ మిల్లు యాజమానులు, వ్యాపారులు మెరుపు సమ్మెకు దిగారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) నిబంధనలు సడలించాలని వ్యాపారులు పత్తి కొనుగోళ్ళను నిలిపి వేశారు. క్రయవిక్రయాలు లేక పత్తి మార్కెట్ లు బోసిపోయాయి.

తెలంగాణలో నిలిచిన పత్తి కొనుగోళ్లు
తెలంగాణలో నిలిచిన పత్తి కొనుగోళ్లు

TG Cotton Purchase: తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.చేతికందిన పత్తిని కొనుగోలు చేసేవారు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ మాయాజాలంతో పత్తి రైతులు నిలువునా మునుగుతున్నారు.

తెల్లబంగారంగా పేరొందిన పత్తి పండించే రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నచందంగా మారింది. గత ఏడాది ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో క్విటాల్ పత్తి ధర పది వేలు పలుకగా ఈసారి రైతులు అధిక ధరకు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు.

ప్రకృతి వైపరీత్యాలను, చీడపీడల బెడదను తట్టుకుని పంటను పండిస్తే తీరా పంట చేతికందే సమయానికి సరైన ధర లేక కొనే నాథుడు కానరాక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈసారి పత్తికి ప్రభుత్వం క్వింటాల్ కు మద్దతు ధర రూ.7521 లు నిర్ణయించింది. సిసిఐ ఎక్కడ నేరుగా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయకపోవడంతో పత్తి వ్యాపారులు ఇష్టారాజ్యంతో ధర నిర్ణయించి రైతులను నిలువునా ముంచుతున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కనిష్టంగా 6000 గరిష్టంగా 6,800 కంటే ఎక్కువ ధర పత్తికి పలకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే అటు జిన్నింగ్ మిల్లు యాజమానులు, వ్యాపారులు సిసిఐ నిబంధనలు నిరసిస్తూ మెరుపు సమ్మెకు దిగారు.

18 జిన్నింగ్ మిల్లులు ఉంటే నాలుగింటికే అలాట్మెంట్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 జిన్నింగ్ మిల్లులు ఉంటే 4 మిల్లులకే పత్తి అలాల్మెంట్ చేశారు. గత రెండేళ్లుగా వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కొనుగోళ్లు లేకపోగా ఒక జిన్నింగ్ మిల్లు నిండాక మరో మిల్లులో కొనుగోళ్లంటూ సీసీఐ కొత్త రాగం పాడుతుండటం కొనుగోళ్లపై పెను ప్రభావం చూపుతుంది. సీసీఐ నిబంధనతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లుతోంది.

సిసిఐ నిబంధనలతో తమకు నష్టమేనని జిన్నింగ్ మిల్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తూ పత్తి కొనుగోళ్ళను నిలిపివేశారు. ఇప్పటికే తెలంగాణ కాటన్ అసోసియేషన్ నిర్ణయించిన క్రమంలో జిల్లాలోని మార్కెట్ కార్యదర్శులతో పాటు జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్ కు లేఖ రాశాయి. పత్తి కొనుగోళ్లకు సహకరించేదిలేదని స్పష్టం చేసింది.

సీసీఐ ఎల్1, ఎల్2, ఎల్ పేరుతో ఒక్కో జిన్నింగ్ మిల్లును మాత్రమే గుర్తించడం మిల్లులకు, రైతులకు తీరని నష్టమని పేర్కొంది. సీసీఐ కొనుగోళ్లతో పాటు ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను నిరవధికం గా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పత్తి రైతులు పరేషాన్…

సీసీఐ నిర్లక్ష్యం, జిన్నింగ్ మిల్లు యాజమానులు సమ్మెతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. దసరా నుంచే పత్తి పంట రైతుల చేతికి అందగా అమ్ముదామంటే కొనుగోలు చేసే వారు లేక పత్తి రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. పెట్టిన పెట్టుబడికి, కూలీలకు ఇచ్చేందుకు చేతిలో డబ్బులు లేక తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని రైతన్నలు నిలువున మునుగుతున్నారు.

పత్తి రైతులు అధికారుల తీరు, పాలకుల వైఖరిపై మండిపడుతున్నారు. రైతులను ముంచేందుకే వ్యాపారులు, సిసిఐ అధికారులు డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. మార్కెట్ మాయాజాలంతో పత్తి రైతులను నిలువునా ముంచుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సీసీఐ ద్వారా నేరుగా పత్తి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు.

జిన్నింగ్ మిల్లు యాజమానులతో అధికారుల చర్చలు

పత్తి కొనుగోళ్ళు నిలిచిపోవడంతో మార్కెట్లని బోసీ పోయాయి. పత్తి రైతుల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. మార్కెటింగ్ అధికారులు రంగంలోకి దిగి జిన్నింగ్ మిల్లుల యాజమానులతో చర్చలు జరిపారు.

సీసీఐ నిబంధనలు సడలించే వరకు పత్తి కొనుగోలు చేయమని వ్యాపారాలు అంటుండగి సిసిఐ నిబంధనలు సేకరించేందుకు ససేమిరా అంటుంది. ఒకటి రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని అంతవరకు ప్రైవేట్ పత్తి కొనుగోళ్లతో పాటు సీసీఐ కొనుగోళ్లు ఉండవని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం తెలిపారు.

(రిపోర్టింగ్ కెవిరెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner