Attack on Allu Arjun house : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. పూలకుండీలు ధ్వంసం.. చేసింది ఎవరు?
Attack on Allu Arjun house : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని బన్నీ ఇంటిపై కొందరు దాడి చేశారు. టమాటాలు విసిరారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది ఓయూ జేఏసీ నేతలను ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఇంటి ఆవరణలోని పూలకుండీలను కొందరు ధ్వంసం చేశారు. ఆకతాయులు బన్నీ ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నామని చెప్పారు.
అసలు ఏం జరిగింది..
ఆదివారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకొని బన్నీ ఇంటి వైపు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు గేటు తీయాలని కోరారు. అందుకు అల్లు అర్జున్ ఇంటి సిబ్బంది నిరాకరించారు. దీంతో నినాదాలు చేస్తూ.. గోడపైకి ఎక్కారు. అక్కడి నుంచి ఇంటి ఆవరణలోకి దూకారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
దాడి చేసింది ఎవరు..
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడికి వచ్చిన వారు నినాదాలు చేశారు. వారు ఓయూ జేఏసీ నేతలని ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే.. వారు వెళ్లిన సమయంలో కొందరు ఆకతాయిలు బన్నీ ఇంటి పైకి టామాటాలు, రాళ్లు విసిరినట్టు తెలుస్తోంది. బన్నీ ఇంటికి వెళ్లినవారు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఆమె కుమారుడిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వీడియో విడుదల..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు వీడియో విడుదల చేశారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని.. మేనేజర్ తాను చెప్తా అన్నాడని వెల్లడించారు. దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు. తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లానని, మహిళ చనిపోయింది, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పానని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. అప్పుడు సినిమా మొత్తం చూశాకే తాను వెళ్తానని అల్లు అర్జున్ అన్నాడని చెప్పారు.
సీపీ వార్నింగ్..
పుష్ప 2 సందర్భంగా కొందరు బౌన్సర్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో.. బౌన్సర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని స్పష్టం చేశారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న పోలీసులను టచ్ చేసినా.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.