Hyderabad Police : తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్
Hyderabad Police : సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బౌన్సర్లకు సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
బౌన్సర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని స్పష్టం చేశారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న పోలీసులను టచ్ చేసినా.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
పోలీసులు ఏం చెప్పారు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు వీడియో విడుదల చేశారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని.. మేనేజర్ తాను చెప్తా అన్నాడని వెల్లడించారు. దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు. తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లానని, మహిళ చనిపోయింది, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పానని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. అప్పుడు సినిమా మొత్తం చూశాకే తాను వెళ్తానని అల్లు అర్జున్ అన్నాడని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో పుష్ప2 విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడిన తర్వాత.. అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
బన్నీ ఏమన్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదన్నారు. అనుమతి లేకుండా వెళ్లామన్నది తప్పుడు ఆరోపణ అన్నారు. ప్రభుత్వంతో తనకు ఎలాంటి వివాదం లేదని పునరుద్ఘాటించారు. సినిమా ఇంత పెద్ద హిట్టు అయినా.. ఆ సక్సెస్‌ను ఆస్వాదించలేకపోతున్నా అని చెప్పారు. 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని.. తొక్కిసలాట గురించి మరుసటి రోజే తనకు తెలిసిందన్నారు.
సీఎం ఏమన్నారు..
ఈ ఘటన జరిగినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సెలబ్రెటీలు, ప్రముఖులు అయితే.. నిబంధనలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ హీరో అయితే.. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌కు పరామర్శలు ఎందుకు.. ఆయనకు కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా.. ఏమైందని ప్రశ్నించారు.