IDP : విదేశాలకు వెళ్లినప్పుడు డ్రైవింగ్ చేయాలనుకుంటే ఇండియాలోనే ఇలా ఈజీగా పర్మిషన్ తీసుకోవచ్చు!
International Driving Permit : కొన్నిసార్లు విదేశాలకు వెళ్లినప్పుడు డ్రైవింగ్ చేయాలనుకుంటారు. కానీ పర్మిషన్ లేకుంటే మాత్రం ఏమీ చేయలేరు. అందుకే ఇండియాలోనే ఐడీపీ అప్లై చేస్తే మీకు పర్మిషన్ దొరుకుతుంది.
అతి త్వరలో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్కడ కూడా డ్రైవింగ్ చేయాలని మీరు అనుకుని ఉండవచ్చు. విదేశీ రోడ్లపై కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తే అదో కిక్కు. కానీ ఇందుకోసం మీకు పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎవరు పడితే వారు విదేశీ రోడ్లపై డ్రైవింగ్ చేస్తే కుదరదు. అందుకోసం మీకు అనుమతి ఉండాలి. అక్కడ డ్రైవింగ్ చేసేందుకు ఐడీపీ అవసరం. ఐడీపీ అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. దీని వల్ల విదేశాల్లో డ్రైవింగ్ చేయవచ్చు.
ఐడీపీ భారతదేశ డ్రైవింగ్ లైసెన్స్‌తో జతచేసిన అధికారిక పత్రం. ఇది అనేక దేశాలలో గుర్తింపు పొందింది. భారతదేశంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం సులువే. దానిని ఎలా అప్లై చేయాలో చూద్దాం.. ఐడీపీ పొందడానికి మీకు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉండాలి. ఇది కాకుండా, సంబంధిత దేశానికి చెందిన మీ పాస్‌పోర్ట్, వీసాను కలిగి ఉండటం అవసరం. మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, ఇతర గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫారం 4A (ఐడీపీ అప్లికేషన్ ఫారమ్), హెల్త్ సర్టిఫికేట్, ఫీజు చెల్లింపు రసీదుని కలిగి ఉండాలి.
ఐడీపీ పొందేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దాని ఆఫ్‌లైన్ ప్రాసెస్ గురించి చుద్దాం.. సమీప ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని(ఆర్టీఓ)కు వెళ్లాలి. ఫారం 4A సరిగ్గా నింపాలి. అవసరమైన అన్ని పత్రాలు, దరఖాస్తు ఫారమ్‌లను ఆర్టీఓకి సమర్పించండి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం నిర్ణీత రుసుం జమ చేయాలి. అప్లికేషన్, డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్ తర్వాత ఐడీపీ కొన్ని రోజుల్లో జారీ చేస్తారు.
ఇక ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులో ఉంటే రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. వెబ్‌సైట్‌లో అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా మీ ఖాతాను క్రియేట్ చేయాలి. ఫారమ్ 4Aని ఆన్‌లైన్‌లో నింపాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుం సమర్పించాలి. సమర్పించిన అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకొని దానిని ట్రాక్ చేయండి. నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు ఐడీపీ పంపిస్తారు.
ఐడీపీ సాధారంగా 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. దాని చెల్లుబాటు వ్యవధి గడువు ముగిసినట్లయితే మీరు మళ్లీ దరఖాస్తు చేయడం ద్వారా దాన్ని పునరుద్ధరించాలి. ప్రతి దేశానికి వేర్వేరు ఐడీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అన్ని డాక్యుమెంట్‌లు సరిగ్గా ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగిసి ఉండొద్దు.
పరివాహన్ వెబ్‌సైట్‌లోనూ దీనికోసం అప్లై చేసుకోవచ్చు. దేశం వెలుపల నాలుగు చక్రాల లేదా ద్విచక్ర వాహనాన్ని నడపడానికి చట్టపరమైన పత్రం ఐడీపీ. ఐడీపీ ముఖ్య ఉద్దేశం మీ డ్రైవింగ్ అధికారాలను అంతర్జాతీయంగా గుర్తించడం. అనేక కార్ల అద్దె కంపెనీలకు తప్పనిసరి. చట్టానికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది.
భారతదేశంలో జారీ చేసిన చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ని కలిగి ఉండాలి. దరఖాస్తు చేసిన తేదీ నుండి ఆరు నెలల కనీస చెల్లుబాటుతో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. దీనికి అప్లై చేసేటప్పుడు రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు లేదా టెలిఫోన్ బిల్లు వంటి చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువును అందించాలి.