Tollywood Vs State Govt : టాలీవుడ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్-అప్పుడు ఏపీలో, ఇప్పుడు తెలంగాణలో!
Tollywood Vs State Govt : సంధ్య థియేటర్ తొక్కిసలాట పెద్ద దుమారాన్నే రేపుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్, అనంతరం పరిణామాలు టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు మారుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
Tollywood Vs State Govt : దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన వారు ఎందరో ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయ లలిత సీఎంలు అయితే...చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రోజా, ఉదయనిధి స్టాలిన్....ఇలా ఎంతో మంది కీలక పదవులు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు కొని ఇప్పటి తెలుగు రాష్ట్రాల వరకూ సినీపరిశ్రమ, రాజకీయ నేతల మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో ఆయనకు రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే సినీ పరిశ్రమ సైతం రాజకీయ పార్టీలకనుగుణంగా మద్దతు పలుకుతున్నాయని తెలుస్తోంది.
సినీ పెద్దలు టీడీపీకి మద్దతుగా ఉండేవారు. ఇప్పటికీ కొందరు బహిరంగంగానే తమ మద్దతు తెలుపుతుంటారు. ఎన్టీఆర్ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆరు నెలల్లో సీఎం కావడంతో... ఆయనకు దగ్గరి వారంతా టీడీపీగా మద్దతుగా ఉండేవారు. ఎన్టీఆర్ అనంతరం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా...సినీ పెద్దల మద్దతు కొనసాగింది. నేటికీ ఆ సంబంధాలను చంద్రబాబు కొనసాగిస్తుంటారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ రాజకీయ పార్టీల వారీగా విడిపోయింది. టీడీపీ, వైసీపీ, జనసేనకు మద్దతుగా విడిపోయారు. ఎక్కువ మంది టీడీపీకి మద్దతుగా ఉన్నా..బయటపడేవారు కాదు. అయితే టీడీపీ ఏపీకి షిఫ్ట్ అవ్వడంతో...తెలంగాణలో ఎవరికి మద్దతుగా ఉండాలనే డైలమా సినీ పెద్దల్లో ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో తెలంగాణలో బీఆర్ఎస్ మద్దతుగా సినీ పరిశ్రమ ఉండేదని బహిరంగ రహస్యం. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సినీ ప్రముఖుల మద్దతు ఉంటుందనేది వాస్తవం.
జగన్ వర్సెస్ పవన్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో అంతగా రాణించలేకపోవడం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితులను పరిశీలించిన పవన్ కల్యాణ్...రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జనసేన పేరిట పార్టీ పెట్టారు. దీంతో మెగాఫ్యాన్స్ మద్దతు పవన్ పార్టీకి చేరింది. సినీ పరిశ్రమలో చిరంజీవి మద్దతుదారుల్లో కొందరు జనసేనకు మద్దతుగా నిలిచారు. ఇదంతా బాగానే ఉన్నా....2019 ఎన్నికల్లో వైసీపీ విజయంతో సీన్ రివర్స్ అయ్యింది. ఏపీలో పవన్ కల్యాణ్ అడ్డుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. పవన్ కల్యాణ్ సినిమాలను అడ్డుకునేందుకు టికెట్ రేట్లను భారీగా తగ్గించారనే విమర్శలు వచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధరలు పేరిట చట్టాలు చేసి...థియేటర్ల వద్ద అధికారులను పహారా పెట్టిన పరిస్థితులు సైతం చూశాం. సినీ పరిశ్రమ నుంచే కొందరిని రంగంలోకి దింపి పవన్ కల్యాణ్ పై ముప్పేట దాడి చేయించేవారు. పవన్ కల్యాణ్ కూటమితో జతకట్టడంతో...సినీ పరిశ్రమ నుంచి ఆయనకు మరింత మద్దతు పెరిగిందనే చెప్పాలి. టికెట్ల ధరలు తగ్గించడంపై అప్పట్లో సంచలనం అయ్యింది. పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైఎస్ జగన్ ఈ విధంగా చేశారని సినీ పెద్దలు బహిరంగంగానే విమర్శించారు. వైఎస్ జగన్ పవన్ ను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారనేది బహిరంగ రహస్యం.
బీఆర్ఎస్ టు కాంగ్రెస్
ఇక తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోవడం...కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగిపోయాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న సినీ ప్రముఖులు...కాంగ్రెస్ కు అంత తొందరగా షిఫ్ట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్...కాంగ్రెస్ ప్రభుత్వంపై టాలీవుడ్ కి ఆగ్రహం తెప్పించాయనే చెప్పాలి. ఇక తాజాగా అల్లు అర్జున్ వివాదంతో తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య మరింత గ్యాప్ పెంచాయి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం...అల్లు అర్జున్ పై చర్యలు తీసుకుంది. అరెస్టు వరకు వెళ్లడం, హైకోర్టు బెయిల్ తో అల్లు అర్జున్ బయటపడడం జరిగాయి. తాజాగా ఈ వివాదాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి అగ్నికి మరింత ఆజ్యం పోయారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన తప్పులేదని చెప్పుకున్నారు.
గద్దర్ అవార్డులు
నంది అవార్డుల తరహాలో తెలంగాణలో గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ అంశంపై సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదు. మధ్యలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి స్పందించినప్పటికీ విషయం ముందుకు వెళ్లలేదు. మంత్రి కొండా సురేఖ వివాదంలో సినీ పరిశ్రమ మొత్తం ఏకమవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరుకున పెట్టేందుకు మరో అంశం దొరికింది. ఈ క్రమంలో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, కేటీఆర్ ఈ విషయాన్ని మీడియా ముందు పదేపదే ప్రస్తావించడం ఇలా...అనేక కారణాలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రభావం సంక్రాంతి రానున్న భారీ బడ్జెట్ సినిమాలపై పడనుంది. టాలీవుడ్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేందుకు సినీ పెద్దలు చొరవ చూపుతారా? ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో వేచిచూడాలి.
సంబంధిత కథనం