Chandrababu Drone Security : చంద్రబాబు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్‌.. ఖర్చు తక్కువ, పని ఎక్కువ!-ap police using autonomous drone for chandrababu security ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Drone Security : చంద్రబాబు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్‌.. ఖర్చు తక్కువ, పని ఎక్కువ!

Chandrababu Drone Security : చంద్రబాబు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్‌.. ఖర్చు తక్కువ, పని ఎక్కువ!

Basani Shiva Kumar HT Telugu
Dec 22, 2024 01:42 PM IST

Chandrababu Drone Security : తన భద్రత విషయంలో పాత పద్ధతులు వద్దని సీఎం చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగేలా చర్యలు చేపట్టారు. తాజాగా చంద్రబాబు భద్రత కోసం డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు.

చంద్రబాబు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్‌
చంద్రబాబు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్‌

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సెక్యూరిటీ కోసం.. అత్యాధునిక అటానమస్ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి రెండు గంటలకు పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోలను షూట్ చేస్తుంది. అనుమానాస్పద విషయాలపై అలర్ట్ అందిస్తుంది. ఈ పద్ధతితో తక్కువ సిబ్బందితో మెరుగైన భద్రత అందేలా చేస్తోందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

ఆధునిక పద్ధతులు..

చంద్రబాబు భద్రతలో సిబ్బంది సంఖ్య తగ్గించినప్పటికీ, సమర్థతతో కూడిన ఆధునిక పద్ధతులను పోలీసులు అనుసరిస్తున్నారు. ఆర్థికంగా, కాలపరంగా ప్రజలపై భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలతో దూరం పెంచే విధమైన బందోబస్తు ఉండకూడదని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లినప్పుడు హడావుడి తగ్గించాలని సూచించారు.

అధికారులకు వార్నింగ్..

చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు పాత పద్ధతులు కొనసాగుతుండడంపై అధికారులను హెచ్చరించారు. ఇటీవల పోలవరంలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించడంపై కలెక్టర్, ఎస్పీలకు సూచనలు చేశారు. డ్రోన్ ఆధారంగా భద్రతా పర్యవేక్షణకు మారాలని స్పష్టం చేశారు. చంద్రబాబు సూచనలతో అధికారులు కొత్తగా ఆలోచిస్తున్నారు.

121 మంది సెక్యూరిటీ..

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కోసం 121 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. కాన్వాయ్‌లో 11 వాహనాలతో ప్రయాణిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో తప్ప, అనవసరంగా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించకూడదని చంద్రబాబు చెప్పడంతో.. సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించినట్టు తెలుస్తోంది.

దాడి తర్వాత..

2003లో అలిపిరి దాడి తర్వాత చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఆయనకు రక్షణగా నిలుస్తారు. ఎర్ర చందనం స్మగ్లర్ల విషయంలోనూ చంద్రబాబు కఠినంగా వ్యవహరించారు. వారి నుంచీ ఆయనకు ముప్పు పొంచి ఉందనే నివేదికలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు భద్రత విషయంలో అధికారులు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు.

Whats_app_banner