Warangal Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి - ప్రొఫెసర్ కంచ అయిలయ్య డిమాండ్-professor kancha ilaiah demanded to change the name of kaloji kalakshetram ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి - ప్రొఫెసర్ కంచ అయిలయ్య డిమాండ్

Warangal Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి - ప్రొఫెసర్ కంచ అయిలయ్య డిమాండ్

HT Telugu Desk HT Telugu
Jul 20, 2024 08:49 AM IST

Warangal Kaloji Kalakshetram : వరంగల్ నిర్మిస్తున్న కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని ప్రొఫెసర్ కంచె అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాయింట్ గా చుక్క సత్తయ్య–గద్దర్ కళాక్షేత్రంగా నామకరణం చేయాలన్నారు.

కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి - కంచె అయిలయ్య డిమాండ్
కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి - కంచె అయిలయ్య డిమాండ్

వరంగల్ నగరంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రంపై ప్రొఫెసర్ కంచ అయిలయ్య వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాళోజీ కవి మాత్రమేనని, కళాక్షేత్రాలకు కేవలం కళాకారుల పేరు మాత్రమే పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి కళాక్షేత్రానికి కాళోజీ పేరు పెట్టాలని నిర్ణయించుకుందని, ఇది కులతత్వం కాదా అని ప్రశ్నించారు. 

కళాక్షేత్రానికి కళాకరుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పెట్టాలని, లేదా ఓరుగల్లుకు చెందిన చుక్క సత్తయ్య లాంటి కళాకారుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రొఫెసర్ కంచ అయిలయ్య కామెంట్స్ ఓరుగల్లులో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ లో ‘తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర’ అనే అంశంపై వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచ అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాక్షేత్రాలకు కళాకారుల పేరు మాత్రమే పెట్టాలని, గద్దర్ కళాకారుడు కాబట్టి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

కాళోజీ నారాయణరావు కళాకారుడు కాదని, కేవలం కవి మాత్రమేనన్నారు. అందుకే కాళోజీ పేరును లైబ్రరీలకు పెట్టాలన్నారు. ఓరుగల్లులో చుక్క సత్తయ్య, సారంగపాణి, శంకర్ లాంటి కళాకారులు ఎందరో ఉన్నారని, అయినా వారి పేర్లు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కళాక్షేత్రానికి కాళోజీ పేరు కాకుండా గద్దర్ పేరు పెడితేనే దేశ వ్యాప్తంగా పేరు వస్తుందని చెప్పారు. లేనిపక్షంలో జాయింట్ గా చుక్క సత్తయ్య–గద్దర్ కళాక్షేత్రంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో మరో పోరాటం తప్పదు

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం, రాజముద్ర, తెలంగాణ గీతాన్ని మార్చినట్టే కాళోజీ క్షేత్రం పేరు కూడా మార్చాలని ప్రొఫెసర్ కంచ అయిలయ్య డిమాండ్ చేశారు. కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టడంతో పాటు అందులో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్నారు. గద్దర్ పేరు పెట్టకపోతే తెలంగాణలో మరో పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు. 

ఆగస్టు 6వ తేదీ గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక కమిటీని కూడా నియమించుకోవాలని పిలుపునిచ్చారు. గద్దర్ అంటే కేవలం ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి వారు కాదని, గద్దర్ అందరి మనిషి అన్నారు. అనంతరం గద్దర్ గళం ఫౌండేషన్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పులు.. ఈ ప్రభుత్వం చేయొద్దని అభిప్రాయపడ్డారు. కాళోజీ కళాక్షేత్రానికి గద్దర్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమానికి డీఎంఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్ సభాధ్యక్షత వహించగా, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్, టీజీవీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మేడ రంజిత్, బీఎస్ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కాడపాక రాజేందర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ లెనిన్, డీబీఎస్ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్ దర్శన్,తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner