Warangal Kaloji Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు..! రూ.90 కోట్లతో కట్టినా ఎందుకిలా జరిగింది..?-cracks on walls of kaloji kalakshetram in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Kaloji Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు..! రూ.90 కోట్లతో కట్టినా ఎందుకిలా జరిగింది..?

Warangal Kaloji Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు..! రూ.90 కోట్లతో కట్టినా ఎందుకిలా జరిగింది..?

HT Telugu Desk HT Telugu
Dec 12, 2024 10:34 PM IST

Warangal Kaloji Kalakshetram: వరంగల్ కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు పట్టాయి. రూ.90 కోట్లతో నిర్మాణం జరగా.. ఇటీవలనే ప్రారంభించారు. నెల కూడా దాటకముందే ఈ పగుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. క్రెడిట్ కొట్టేసేందుకు హడావిడిగా పనులు చేసి… ప్రజాధనాన్ని వృథా చేస్తారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు
వరంగల్ కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిని తలదన్నేలా వరంగల్ లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రానికి ఆదిలోనే పగళ్లు ఏర్పడ్డాయి. గత, ప్రస్తుత ప్రభుత్వాలు మొత్తంగా రూ.90 కోట్ల వరకు వెచ్చించి, ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరున నిర్మించిన ఈ కళాక్షేత్రం ఓపెనింగ్ నిర్వహించి నెల కూడా దాటకముందే ఈ పగుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. 

శంకుస్థాపన చేసి పదేళ్లపాటు పట్టించుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, క్రెడిట్ కొట్టేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం హడావుడిగా పనులు పూర్తి చేయడం వల్లే కళాక్షేత్రానికి ఈ దుస్థితి ఎదురై ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు అసంపూర్తిగా ఉండటంతో పాటు సరిగా క్యూరింగ్ కాకముందే హడావుడిగా ప్రారంభానికి సిద్ధం చేయడం వల్ల గోడలు నెర్రలుబారాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా రూ.90 కోట్లు పెట్టి పూర్తి చేసిన కళాక్షేత్రం ఆదిలోనే పగుళ్ల బారిన పడటంతో దాని నాణ్యత ప్రమాణాలు అధికారులు కూడా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2014లో శంకుస్థాపన

తెలంగాణ ఏర్పడిన కొత్తలో వరంగల్ కు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరున కళాక్షేత్రం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ కు వచ్చిన కేసీఆర్.. ఈ మేరకు హయగ్రీవాచారి గ్రౌండ్ పక్కనే ఉన్న నాలుగెకరాల స్థలంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. 

రవీంద్ర భారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రం నిర్మించాలంటూ రూ.50 కోట్లు కూడా ప్రకటించారు. శంకుస్థాపన చేసిన తరువాత సరైన సమయంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల పనులు నెమ్మదించాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోవడం, కాళోజీ జయంతి, వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా పనులు పూర్తి చేస్తామంటూ హడావుడి చేయడం తప్ప పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాళోజీ కళాక్షేత్రం పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో పదేళ్ల పాటు కాళోజీ కళాక్షేత్రం అసంపూర్తిగానే ఉండిపోయింది. ఏ ఎన్నిక వచ్చిన ప్రతిపక్షాలకు ఇదొక అస్త్రంగా మాత్రమే ఉపయోగపడింది.

10 నెలల్లో ప్రారంభించిన కాంగ్రెస్…

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పనులను సాగదీయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇక్కడి లీడర్లు కాళోజీ కళాక్షేత్రాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ అంచనాలు మార్పించి, రూ.90 కోట్లకు పెంచారు. ఆ తరువాత నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేయించారు. 

కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్న ఇక్కడి ఎమ్మెల్యేలు పనుల్లో నాణ్యతా ప్రమాణాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. వేగంగా పూర్తి చేయాలని టార్గెట్లు పెట్టడం తప్ప పనుల నాణ్యతను ఎప్పుడూ పట్టించుకోలేదు. దీంతో ఆఫీసర్లు మాత్రం ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు పనులు స్పీడప్ చేయించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభానికి సిద్ధం చేశారు. మొదట కాళోజీ జయంతి సెప్టెంబర్ 9న ఓపెనింగ్ చేద్దామనుకున్నప్పటికీ.. ఆరోజు సీఎం టూర్ ఖరారు కాకపోవడంతో కళాక్షేత్రం ఓపెనింగ్ వాయిదా వేశారు. చివరకు నవంబర్ 19న వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాళోజీ కళాక్షేత్రాన్ని గ్రాండ్ గా ఓపెనింగ్ నిర్వహించారు.

ఆదిలోనే పగుళ్లు…

కాళోజీ కళాక్షేత్రం క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాటపడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాక్షేత్రం భీములు, గోడలు బీటలు వారడంతో దాని భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అందులో అధికారికంగా ఒకట్రెండు ప్రోగ్సామ్స్ మాత్రమే జరగగా.. ఓపెనింగ్ చేసిన నెల రోజుల్లోగానే లోపాలు బయటపడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 క్రెడిట్ కొట్టేసేందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. కాళోజీ అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడే పగుళ్ల బారిన పడగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner