USA news: పౌర‌స‌త్వం కోసం పెళ్లా? చెల్ల‌నే చెల్ల‌దు: అమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు-us supreme court ruling says marriage for citizenship is not at all valid ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Usa News: పౌర‌స‌త్వం కోసం పెళ్లా? చెల్ల‌నే చెల్ల‌దు: అమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

USA news: పౌర‌స‌త్వం కోసం పెళ్లా? చెల్ల‌నే చెల్ల‌దు: అమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

Sudarshan V HT Telugu
Dec 12, 2024 08:35 PM IST

US Supreme Court ruling: పౌర‌స‌త్వం కోసం చేసుకునే పెళ్లి చెల్ల‌దని అమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించింది. మోస‌పూరితంగా చేసుకునే పెళ్లి చెల్ల‌దని పేర్కొంది. ఇలాంటి వీసాలను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాలని సూచించింది.

అమెరికా సుప్రీంకోర్టు
అమెరికా సుప్రీంకోర్టు (Bloomberg)

US Supreme Court ruling: భార‌త్ నుంచి అమెరికా వెళ్లే వారికి పౌర‌స‌త్వం పొందే విష‌యంలో అత్యంత సులువైన మార్గం వివాహం. అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకోవ‌డం ద్వారా రాజ‌మార్గంలో సిటిజ‌న్ షిప్ దొరుకుతోంది. అయితే ఇందులో ఉన్న వెసులుబాటును అడ్డుపెట్టుకుని కేవ‌లం పౌర‌స‌త్వం కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై న‌మోద‌యిన కేసుల్లో సుప్రీంకోర్టు (US Supreme Court) కీల‌క ఉత్తుర్వులిచ్చింది.

సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల్లో కీల‌క అంశాలు

* పౌర‌స‌త్వం కోస‌మే పెళ్లిళ్లు అని నిర్దార‌ణ అయితే వాటిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు

* వీసా అనుమతులను ఉపసంహరించుకోవడానికి హోంల్యాండ్ అధికారుల‌కు విచక్షణాధికారం

* ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్ణ‌యాన్ని సమీక్షించవ‌ద్ద‌ని ఫెడరల్ కోర్టులకు ఆదేశం

అస‌లు కేసు ఏంటీ?

Bouarfa v. Mayorkas కేసులో అమీనా బౌర్ఫా అమెరికా పౌరురాలు. ఈమె హమాయెల్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. అప్ప‌టికి హ‌మాయెల్‌కు ఇంకా సిటిజ‌న్‌షిప్ ద‌క్క‌లేదు. పౌరసత్వం లేని త‌న జీవిత భాగస్వామి హమాయెల్ కోసం బౌర్ఫా వీసా పిటిషన్‌ను దాఖలు చేసింది. మొదట్లో పిటీషన్‌ను ఆమోదించినా.. ఆ త‌ర్వాత ఇది బూటకపు పెళ్లి అని తేల్చి.. వీసాను రద్దు చేశారు. అధికారుల నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (INA) హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీకి ఈ అధికారం ఉందని, త‌న విచ‌క్ష‌ణను వాడి వీసాను ర‌ద్దు చేయవ‌చ్చ‌ని తెలిపింది.

ఈ తీర్పు ఎవ‌రిపై ప్ర‌భావం?

Bouarfa v. Mayorkas కేసులో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇటీవ‌ల కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న వారిపై ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. కేవ‌లం పౌర‌స‌త్వం కోస‌మే పెళ్లి చేసుకుంటే మాత్రం వీసా ర‌ద్ద‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇక్క‌డి నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు.. త‌మ భ‌విష్య‌త్తు కోసం, అమెరికాలో స్థిర‌మైన జీవితం కోసం పెళ్లి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాత్కాలిక‌మైన వీసా కంటే పౌర‌స‌త్వం పొంద‌డమ‌నేది ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలను క‌ల్పిస్తోంది. దీని కోసం విడాకులు తీసుకున్న‌వారిని, లేదంటే పెళ్లి కాకుండా మిగిలిపోతున్న వారిని ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇదొక ఆర్థిక నేరంగా మారింద‌న్న‌ది అమెరికా అధికారుల అభిప్రాయం. కొంత మొత్తం డ‌బ్బు ఇవ్వ‌డం, రికార్డుల కోసం పెళ్లి చేసుకోవ‌డం, రెండు మూడేళ్ల త‌ర్వాత మ‌రో దారి చూసుకోవ‌డం.. ఇదొక స్కాంగా మారింద‌ని చెబుతున్నారు.

మ‌రి నిజ‌మైనవారి సంగ‌తేంటీ?

1. అమెరికా పౌరుడు లేదా పౌరురాలుతో మీ వివాహం నిజమైంద‌ని నిరూపించుకోవాలి

2. పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు కనీసం మూడు సంవత్సరాల పాటు మీ U.S. జీవిత భాగస్వామితో కలిసి జీవించి ఉన్న‌ట్టు ఆధారాలుండాలి

3. ఫారమ్ N-400ని సరిగ్గా ఫైల్ చేయాలి

4. మీ ప‌రిచయం, నేపథ్యం, ఎక్క‌డ క‌లిశారు? ఎప్పుడు డేటింగ్ జ‌రిగింది? పెళ్లి నిర్ణ‌యానికి ఎలా వ‌చ్చారు? ఇవ‌న్నీ ఆధారాలుండాలి.

5. మీ వివాహం యొక్క ప్రామాణికతను నిరూపించడానికి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలు, లీజులు మరియు ఫోటోలతో సహా సమగ్ర రికార్డులను నిర్వహించాలి.

6. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని అందించవద్దు, ఇద్ద‌రినీ విడివిడిగా అడుగుతారు, వివ‌రాల్లో తేడా రావొద్దు.

రచయిత: శ్రీనాథ్ గొల్ల‌ప‌ల్లి, జ‌ర్న‌లిస్ట్ & లాయ‌ర్‌, ఇమ్మిగ్రేష‌న్ నిపుణులు
రచయిత: శ్రీనాథ్ గొల్ల‌ప‌ల్లి, జ‌ర్న‌లిస్ట్ & లాయ‌ర్‌, ఇమ్మిగ్రేష‌న్ నిపుణులు
Whats_app_banner