Komuravelli Mallanna Jatara 2025 : కొమరవెల్లి మల్లన్న జాతర తేదీలు ఖరారు - ఈనెల 29న కల్యాణం-komuravelli mallanna swamy kalyanam jathara to be held grandly from december 29 to january 19 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Komuravelli Mallanna Jatara 2025 : కొమరవెల్లి మల్లన్న జాతర తేదీలు ఖరారు - ఈనెల 29న కల్యాణం

Komuravelli Mallanna Jatara 2025 : కొమరవెల్లి మల్లన్న జాతర తేదీలు ఖరారు - ఈనెల 29న కల్యాణం

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 12, 2024 09:32 PM IST

Komuravelli Mallanna Jatara 2025 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం, జాతర తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 29 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం జరగనుంది. 19 జనవరి 2025 నుంచి 10 ఆదివారాలపాటు… 23 మార్చి 2025 వరకు జాతర నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది.

కొమురవెల్లి జాతర (ఫైల్ ఫొటో)
కొమురవెల్లి జాతర (ఫైల్ ఫొటో)

Komuravelli Mallanna Jathara in Telangana: సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరలను వైభోవంగా నిర్ణయించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

గురువారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రి సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… గత సంవత్సరం కంటే మరింత వైభవోపేతంగా మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు.

జాతర తేదీలు….

డిసెంబర్ 29 ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి వారి కల్యాణం జరగనుంది. జనవరి 19 నుంచి 10 వారాలపాటు మార్చి 23 వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ఈ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఈవోను మంత్రి సురేఖ ఆదేశించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనులపై ఆరా తీశారు. రూ. 9.776 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు, రూ. 36.18 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను ఈవో.. మంత్రికి వివరించారు. కిరీటాల తయారీ పనుల పురోగతిలో వున్నట్ల్లు తెలిపారు.

భక్తుల క్యూలైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సిసి కెమరాల నిఘా, వివిఐపిలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండేలా చూడాలని మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు. జాతర సమయానికి వేసవి కాలం రానుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతర జరుగుతున్నన్ని రోజులు సాయంత్రాల్లో కళాబృందాలచే ఒగ్గుకథ వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. కల్యాణోత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా వుండేలా కార్యాచరణను వెంటనే అమలుపరచాలని సూచించారు.కల్యాణంతో పాటు, జాతర జరిగినన్ని రోజుల దేవాలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేయడంతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

 

Whats_app_banner