Konda Surekha : సంతలకు వేములవాడ రాజన్న కోడెలు..! మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ
Konda Surekha : మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి వేములవాడ ఆలయ ఈవో కారణంగా మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ కోడెల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కోడెలను నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి అప్పగించారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మంత్రికి సమస్యగా మారింది. కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో అప్పగించారు. మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించినట్టు తెలుస్తోంది.
ఒకే వ్యక్తికి 49..
నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 49 కోడెలను అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దల్ నాయకుల ఫిర్యాదుతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ వ్యవహారం వెనక మంత్రి సురేఖ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్క వ్యక్తికే 49 కోడెలను ఎలా ఇస్తారని.. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దల్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
సంతలకు కోడెలు..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మనుగొండ గ్రామం ఉంది. ఇక్కడి శ్రీరాజేశ్వర సొసైటీ అధ్యక్షుడు మాదాసి రాంబాబు పేరుతో ఏర్పాటు చేసిన లెటర్ ప్యాడ్‌తో.. రాజన్న కోడెలను తరలిస్తున్నారు. ఈ లేఖను మంత్రి సిఫారసు చేసినట్లు ఉంది. 60 కోడెలకు 49 కోడెలు పక్కదారి పట్టడం చర్చనీయాంశమైంది. శ్రీరాజేశ్వర సొసైటీ పేరుతో అక్కడ ఎలాంటి గోశాల లేదని.. వేములవాడ నుంచి తీసుకెళ్లిన కోడెలను సంతలో అమ్ముతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
కోడె మొక్కులకు ప్రాధాన్యత..
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కోడె మొక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు స్వామి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకునే కోడెలను.. ఆలయ అధికారులు వివిధ గో సంరక్షణ సొసైటీలకు, గోశాలలకు అప్పగిస్తారు. అయితే.. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు.. వేములవాడ ప్రాంతంలోని స్థానిక రైతులకు రాజన్న కోడెలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది.
ఎక్కువ ఆదాయం..
వేములవాడ దేవాలయానికి ఎక్కువ ఆదాయం కోడె మొక్కుల ద్వారానే వస్తుంది. ఈ నేపథ్యంలో.. కోడెల సంరక్షణ కోసం ఆలయ అధికారులు రెండు గోశాలలను ఏర్పాటు చేశారు. మూడు రూపాల్లో కోడెలను భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకుంటున్నారు
1.నిజ కోడె. అంటే.. భక్తులు గోశాలలో కొని స్వయంగా కొడెను తీసుకువచ్చి స్వామివారి సమర్పిస్తారు.
2. కోడె టికెట్ కొని కోడెమొక్కులు చెల్లించుకుంటారు.
3. రైతులు, భక్తులు స్వయంగా ఇంటి నుంచి తీసుకొని వచ్చి.. కుటుంబ సమేతంగా కోడె మొక్కులు చెల్లించుకుంటారు.