Bhadrachalam : భద్రాద్రిలో అట్టహాసంగా సీతారాముల కల్యాణం.. రామ నామ స్మరణతో పులకించిన భద్రగిరి
Bhadrachala Ramayya Kalyanam 2024: భద్రాచలం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా మైదానంలో భక్తులతో కిక్కిరిసిపోయింది.
Bhadrachala Ramayya Kalyanam 2024: ఏక పత్నీవ్రతుడు, లోక నాయకుడిగా కీర్తించే శ్రీరామ చంద్రుడి కళ్యాణ మహోత్సవం భద్రాచలంలో(Bhadrachala) అట్టహాసంగా, కన్నుల పండుగగా జరిగింది. కమనీయంగా జరిగిన సీతారాముల వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో భద్రగిరికి తరలివచ్చారు. భక్తుల రామ నామ స్మరణతో భద్రగిరి పుర వీధులు పులకించి పోయాయి.
లోక కళ్యాణంగా జరిగే రామయ్య, సీతమ్మల పరిణయ వేడుకను(Bhadrachala Ramayya Kalyanam) తనివితీరా తిలకించేందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భద్రాచల పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన కళ్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణతో భద్రాద్రి కొండ భక్తి పారవశ్యంతో మార్మోగింది. భద్రాద్రి పట్టణం యావత్తు కళ్యాణ శోభను సంతరించుకుంది. చూర్ణిక పఠనం ద్వారా వేద పండితులు సీతారాముల కళ్యాణ కమనీయ వేడుక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. మిరుమిట్లు గొలుపుతున్న మిథిలా స్టేడియం వేదికకా శోభాయమానంగా జరిగిన కళ్యాణ వేడుకను తిలకించిన వేలాది మంది భక్తులు పులకించిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తాలంబ్రాలను భద్రాద్రి రామయ్య కల్యాణానికి పంపడం విశేషం.
కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచ్చేసి వేడుకలో పాల్గొన్నారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లాన్ని వేద పండితులు స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ధరింపజేశారు. ఈ సందర్భాన "సీతారాం.. సీతారాం.. సీతారాం జయ సీతారాం" అంటూ రామ నామ స్మరణ చేస్తూ భక్తులు పారవశ్యంతో పరవశించారు. అనంతరం శ్రీరాముడి చేతులను తాకించిన మంగళ సూత్రాలను అర్చకులు సీతమ్మ మెడలో ధరింపజేయడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. అనంతరం ముత్యాల తలంబాలను ఉత్సవ విగ్రహాలపై పోయడంతో సీతారాముల కళ్యాణ ఘట్టం పూర్తయింది. 2 వేల మంది పోలీసుల పహారా నడుమ భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా పూర్తవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.