Khammam Results: ఖమ్మంలో 9చోట్ల కాంగ్రెస్ కూటమి గెలుపు, భద్రాచలంలో బిఆర్‌ఎస్
Khammam Results: ఖమ్మంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. పదిలో 9 స్థానాల్లో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం లభించింది. ఒక్క స్థానంలో మాత్రమే బిఆర్ఎస్ గెలిచింది.
Khammam Results: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాల్లో జరిగిన ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది.
ఈ ధాటికి ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఓటమి పాలయ్యారు. 50 వేల పైచిలుకు వ్యత్యాసంతో ఆయన ఓటమి చెందడం గమనార్హం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగించగా, సీపీఐ తో పొత్తు పెట్టుకున్న కొత్తగూడెం స్థానంలోనూ సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు జయకేతనం ఎగురవేశారు. దీంతో మొత్తం పది స్థానాల్లో 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీని నమోదు చేయడం విశేషం.
ప్రతి ఒక్కరికీ 20 వేల పైచిలుకు మెజారిటీనే రావడం గమనార్హం. పాలేరులో పోటీ చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 57,231 ఓట్ల మెజారిటీ సాధించి జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా రికార్డుకెక్కారు. కేవలం భద్రాచలం నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ గెలుపొందింది ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ వైద్యుడు తెల్ల వెంకటరావు 6,319 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి పొడెం వీరయ్యపై గెలిచారు.
అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలివి..
ఖమ్మం
తుమ్మల నాగేశ్వరావు 50,130 (కాంగ్రెస్)
పాలేరు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి 57,231 (కాంగ్రెస్)
మధిర
మల్లు భట్టి విక్రమార్క 33,665 (కాంగ్రెస్)
సత్తుపల్లి
మట్టా రాఘమయి 21,243 (కాంగ్రెస్)
వైరా
రాందాస్ నాయక్ 33,069 (కాంగ్రెస్)
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
అశ్వారావుపేట
జారే అదినారాయణ 28,606 (కాంగ్రెస్)
పినపాక
పాయం వెంకటేశ్వర్లు 34,129 (కాంగ్రెస్)
ఇల్లెందు
కోరం కనకయ్య 55,718 (కాంగ్రెస్)
కొత్తగూడెం
కూనంనేని సాంబశివరావు 22,125 (సీపీఐ)
భద్రాచలం
తెల్లం వెంకటరావు 6,319 (BRS)
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.