Hyderabad STPs : 'మూసీ' ప్రక్షాళనలో మరో అడుగు...! త్వరలోనే అందుబాటులోకి మరికొన్ని ఎస్టీపీలు
Sewage Treatment Plants in Hyderabad : మరికొన్ని ఎస్టీపీలను ప్రారంభించేందుకు హైదరాబాద్ జలమండలి సిద్ధమవుతోంది. జనవరి నాటికి 9 ఎస్టీపీలు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే 11 ఎస్టీపీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త ఎస్టీపీల ప్రారంభంతో మూసీ నీటి ప్రక్షాళనలో మరో అడుగు ముందుకు పడినట్లు అవుతుంది.
రానున్న జనవరి నాటికి హైదరాబాద్ నగరంలో మరికొన్ని సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీ) అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా జల మండలి అడుగులు వేస్తోంది. పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేసింది. నగరంలో మరో 9 ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఈ నిర్మాణలపై ఇటీవలే జల మండలి ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ఎస్టీపీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని.. జనవరి నాటికి పనులు పూర్తి అవ్వాలని ఆదేశించారు. సరిపడా కార్మికులను ఈ ఎస్టీపీల నిర్మాణానికి కేటాయించాలని నిర్మాణ సంస్థకు కూడా సూచించారు. వివిధ దశల్లో పనులు పూర్తి చేయడానికి నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తి కాకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఎస్టీపీల నిర్మాణంలోని వివిధ దశల పనులు అవకాశం ఉన్నంత వరకు సమాంతరంగా జరగాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. అనుకున్న సమయానికి ఎలెక్ట్రో మెకానికల్ ఈక్విప్మెంట్ సమకూర్చుకోవాలని… ఇందుకు గానూ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రెండు షిఫ్టుల్లో పనులు జరగాలని సూచించారు.
ఎస్టీపీల నిర్మాణంలో భద్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని పేర్కొన్నారు. కార్మికులు కచ్చితంగా భద్రతా పరికరాలను వినియోగించేలా చూడాలని చెప్పారు. ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్న ప్రదేశాల్లో తగు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివిధ దశలో 9 ఎస్టీపీలు…
జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టుల్లో నిర్మిస్తున్న వాటిల్లో.. ఇప్పటికే 11 ఎస్టీపీలు ప్రారంభమయ్యాయి. మరో 9 ఎస్టీపీలు నిర్మాణం దశలో ఉన్నాయి. వీటిలో డిసెంబర్ లో పాలపిట్ట, వెన్నల గడ్డ ఎస్టీపీలు పూర్తి కావాలన్నారు. జనవరిలో అంబర్ పేట్, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్, నలగండ్ల, అత్తాపూర్, రెయిన్ బో విస్తా, రామ చెరువు దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
నగరంలో సీవరేజ్ స్పెషల్ డ్రైవ్ :
నిరంతర పకడ్బందీ పర్యవేక్షణతో 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన… “సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ - హైదరాబాద్” లక్ష్యంగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. బుధవారం 70 రోజులు పూర్తయిందన్నారు.
ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 50 శాతం చేరుకున్నట్లు తెలిపారు. బుధవారం నాటికి 12673 ప్రాంతాల్లో 1602 కిలోమీటర్ల మేర సీవరేజ్ పైపు లైన్, 1.22 లక్షల మ్యాన్ హోళ్లలో పూడికతీత పనులు చేసినట్లు చెప్పారు. మురుగు నీటి నిర్వహణలో రోజూవారీగా ఉపయోగించే 220 ఎయిర్ టెక్ మిషన్లు, 146 సిల్ట్ తరలింపు వాహనాలు, సీవరేజ్ సిబ్బందినే ఇందులోనూ వాడుకునేలా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు.