Nalgonda Irrigation Projects : సాగునీటి ప్రాజెక్టుల్లో సమస్యల తిష్ట - ఆశలు రేపుతున్న మంత్రుల ప్రకటనలు-there are many problems in the irrigation projects of nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Irrigation Projects : సాగునీటి ప్రాజెక్టుల్లో సమస్యల తిష్ట - ఆశలు రేపుతున్న మంత్రుల ప్రకటనలు

Nalgonda Irrigation Projects : సాగునీటి ప్రాజెక్టుల్లో సమస్యల తిష్ట - ఆశలు రేపుతున్న మంత్రుల ప్రకటనలు

HT Telugu Desk HT Telugu
Sep 21, 2024 11:49 AM IST

నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల్లో అనేక సమస్యలు తిష్ట వేశాయి. కీలకమైన డిండి ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేనే లేదు. మరోవైపు మూసీ ప్రాజెక్ట్ కాలుష్య కాసారంగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లా మంత్రులు చేస్తున్న ప్రకటనలు…రైతులతో పాటు సామాన్య ప్రజల్లో ఆశలు పుటిస్తున్నాయి.

SLBC ప్రాజెక్ట్
SLBC ప్రాజెక్ట్ (Image Source @KomatireddyKVR 'X')

దాదాపు రెండు దశాబ్ధాల కిందట శంకుస్థాపన జరిగిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్.ఎల్.బి.సి / శ్రీశైలం సొరంగ మార్గం ) ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి చొరవతో రూ.1925కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలైనా ఆ తర్వాత దశాబ్ద కాలంలో పూర్తి కాలేదు.

2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పదేళ్ల పాలన పూర్తయ్యాక కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు పూర్తి చేయుడంపై శ్రద్ధ పెట్టలేదు. ఇపుడు 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి తొమ్మిది నెలల పూర్తయ్యాక.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ను సందర్శించి పనులు పూర్తిచేస్తామని, అవసరమైన బడ్జెట్ కేటాయిస్తామని భరోసా కల్పించారు.

2027 డెడ్ లైన్…!

సాగునీటి శాఖా మంత్రి మరో అడుగు ముందుకేసి 2027 నాటికల్లా పనులు పూర్తవుతాయని నమ్మకంగా చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం ఎస్.ఎల్.బి.సి మాత్రమే పెండింగులో లేదు. డిండి ఎత్తిపోతల పథకంతో పాటు, సుమారు ఆరు దశాబ్ధాల కిందట నిర్మించిన మూసీ ప్రాజెక్టు సైతం సమస్యల్లో కూనరిల్లుతోంది. ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి, సాగు, తాగునీరు అందించడానికి ప్రభుత్వం ఇంకా ఏం చేయాల్సి ఉందంటే..

శ్రీశైలం సొరంగ మార్గం ( ఎస్.ఎల్.బి.సి టన్నెల్) పనులు పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ కేటాయించాలి. డిండి ఎత్తిపోతల లిఫ్టు పథకం ప్రాజెక్టు పూర్తి నివేదిక డి.పి.ఆర్ ను ఆమోదించాల్సి ఉంది. డిండి ఎత్తిపోతల పథకంలో ఇంకా భూ సేకరణకు జరపాల్సి ఉన్నందున సరిపడా నిధులు కేటాయిస్తూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సి ఉంది. భూ నిర్వాసితులు కోల్పోతున్న భూములకు బహిరంగ మార్కెట్ ధరలకే చెల్లింపులు చేపట్టాలి. మరో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రాజెక్ట్ ను ఆధునీకరించాల్సి ఉంది.

నిధులే అసలు సమస్య

నల్లగొండ జిల్లాలో 3.20లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పదేళ్ళుగా పడకేశాయి. 19 ఏళ్ల కిందట రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులకు ఇపుడు రూ.4658 కోట్ల బడ్జెట్ అవసరం అవుతోంది. ఈ టన్నెల్ ప్రాజెక్టులో ఇంకా 10 కిలోమీటర్ల మేర సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది.

గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలన కాలంలో అరకొరగా నిధులు కేటాయించడంతో సొరంగం పనులు అడుగుకు ముందుకు పడలేదు. ఫలితంగా స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. సొరంగం పూర్తయితేనే అనుకున్న స్థాయిలో సాగు, తాగు నీరు అందుతుంది. సుమారు 2.20 టీఎంసీల నీటి సామార్ధ్యం ఉన్న పెండ్లిపాకల రిజర్వాయరు పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీనికింద ఇంకా 950 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ‘‘ ఇప్పటికిప్పుడు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి రూ.2200 కోట్లు అవసరం అవుతాయి. ఎన్నికల హామీల్లో పేర్కొన్నవిధంగా ఈ ప్రభుత్వం టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలి..’’ అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెండింగులోనే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే మహాబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనికోసం ప్రభుత్వం జీ.వో. 107 ను 2015 జూన్ 11వ తేదీన విడుదల చేశారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3.41 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.

సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టిరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. కానీ, గత ప్రభుత్వం డిపిఆర్‌ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను ఆమోదించలేదు. పర్యావరణ అనుమతుల కోసం లేఖ రాయలేదు. దీంతో ఈప్రాజెక్టు విషయమై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది. ‘‘ కనీసం ఈ ప్రభుత్వమైనా వెంటనే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎదుల రిజర్వాయర్‌ నుండి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు నీటిని వాడుకునేలా డీపీఆర్‌ను అమోదించాలి. పర్యావరణ అనుమతులు తీసుకుని పనులు ప్రారంభమయ్యేలా నిధులు కేటాయించాలి...’’ అని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి, రైతు నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు.

కాలుష్య కాసారంగా మారిన మూసీ

నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టులో నిలువ నీటి సామర్ధ్యం పెంచేందుకు పూడిక తీయాలి. కుడి, ఎడమ కాలువలకు లైనింగ్‌, పూడిక తీత, షట్టర్ల నిర్మాణం వంటి పనులు చేపట్టాలి. మూసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలి. 1963లో 4.6 టీఎంసీల నీటి సామర్ధ్యంతో మూసీ ప్రాజెక్టును నల్లగొండ జిల్లా సోలిపేట గ్రామం వద్ద నిర్మించారు. కానీ ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో క్రమంగా నీటి నిల్వ సామర్ద్యం తగ్గుతూ వచ్చింది.

నిల్వ సామర్ధ్యం సగానికిసగం పడిపోయింది. మూసీ ఆయకట్టు పరిధిలోని కుడి, ఎడమ కాలువలు శిధిలం అయ్యాయి. షట్టర్లు లేక, లైనింగ్‌ చేయక ఆయకట్టు చివరి భూములకు నీరు అందే పరిస్థితి లేదు. మూసీలోకి వస్తున్న కలుషిత నీటివల్ల ప్రజలు, పశువులు తాగడానికి పనికిరాకుండా పోవడమే కాకుండా, పండించిన పంటలలో కూడా కాలుష్య కారకాలు చేరి ప్రజలు ఆనారోగ్యానికి గురవుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి. మూసీని ఆధునీకరించి సుందరీకరిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతుంది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

సంబంధిత కథనం