SLBC Project : నెరవేరని దశాబ్దాల నాటి శ్రీశైలం సొరంగం కల, ఈసారి బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయింపు-nalgonda slbc project govt allocated 800 cr in budget cpi requests more funds to complete ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Slbc Project : నెరవేరని దశాబ్దాల నాటి శ్రీశైలం సొరంగం కల, ఈసారి బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయింపు

SLBC Project : నెరవేరని దశాబ్దాల నాటి శ్రీశైలం సొరంగం కల, ఈసారి బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయింపు

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 06:17 PM IST

SLBC Project : ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల దశాబ్దాల కల శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు మారింది. కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయించడంతో పనులు కాస్త ముందుకు సాగుతాయని జిల్లా వాసులు భావిస్తు్న్నారు.

నెరవేరని దశాబ్దాల నాటి శ్రీశైలం సొరంగం కల, ఈసారి బడ్జెట్ లో రూ.800 కోట్లు
నెరవేరని దశాబ్దాల నాటి శ్రీశైలం సొరంగం కల, ఈసారి బడ్జెట్ లో రూ.800 కోట్లు

SLBC Project : భూగర్భ జలాల్లో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతంగా నల్గొండ జిల్లా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సాగునీటి సమస్య వల్ల భూగర్భ జలాలపై ఆధారపడే ఇక్కడ రైతాంగానికి, అదే మాదిరిగా ఫ్లోరైడ్ నీటితో శరీరాలు అష్టవంకరలు తిరిగిన బాధితులకు సురక్షితమైన ఉపరితల సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిరాశపరుస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దశాబ్దాల అలుపెరగని పోరాటాల ఫలితంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్.ఎల్.బి.సి) ప్రాజెక్టుకు అంకురార్పన జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, నల్గొండ, నకిరేకల్ ఆరు నియోజకవర్గాలు అంటే, సగం జిల్లాకు ఈ ప్రాజెక్టు ద్వారా 3 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో మొదలైన శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు (ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టు) పనులు గడిచిన దశాబ్ద కాలంగా అడుగు ముందుకు పడలేదు. కృష్ణా నదిలో వరద నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సొరంగం మార్గంలో జిల్లాకు తరలించే ఈ ప్రాజెక్టుకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా 2005 లో శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్టులో 44 కిలోమీటర్ల నిడివిలో సొరంగం తవ్వాల్సి ఉంటుంది. రూ.1920 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్టు తాజా అంచనా రూ.3152 కోట్లకు చేరింది. పనుల పూర్తికి రూ.4468 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాగా, రాష్ట్ర తాజా బడ్జెట్లో శ్రీశైలం సొరంగం మార్గానికి రూ.800 కోట్లు కేటాయించడంతో పనులు వేగవంతంగా జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.

ఇదీ... ప్రాజెక్టు కథ

శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచి తవ్వే సొరంగం ద్వారా జిల్లాకు నీరివ్వాలి. 44 కిలోమీటర్ల నిడివిలో రెండు సొరంగాలను తవ్వాల్సి ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వచ్చే టన్నెల్ 1, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద పూర్తవుతుంది. దీని నిడివి 43.5 కిలోమీటర్లు. ఇందులో ఇంకా 9 కిలోమీటర్ల సొరంగం పనులు పెండింగులో ఉన్నాయి. నల్గొండ జిల్లా చందంపేట మండలం తేల్దేవర్ పల్లి వద్ద టన్నెల్ 2 ప్రారంభమై నేరెడుగొమ్ము వద్ద పూర్తవుతుంది. ఈ సొరంగం నిడివి 7 కిలోమీటర్లు. మొత్తంగా ఈ ప్రాజెక్టు పరిధిలో మరో 10 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయితే కానీ నీరందే పరిస్థితి కనిపించడం లేదు. రెండు టన్నెల్స్ పనులు రెండు వైపులా మొదలు పెడితే నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల పాటు నిరంతరాయంగా పనులు చేస్తేనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

శ్రీశైలం నిండగానే... సీపేజీతో సమస్య

ప్రస్తుం శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణా నదిలోకి అన్ని గేట్లు ఎత్తి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండి ఉండడంతో టన్నెల్ 1 లోకి సీపేజీ నీరు చేరుతుండడంతో వాటిని మూడు దశల్లో 20హెచ్.పి, 30 హెచ్.పి మోటార్లతో తోడి పోస్తున్నారు. దీనికే నెలకు సుమారు రూ.2 కోట్ల విద్యుత్ బిల్లులు అవుతున్నాయని కాంట్రాక్టు సంస్థ వాపోతోంది. దీనివల్ల పనులకూ అంతరాయం జరుగుతోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) వస్తున్న మరమ్మతులు, ప్రభుత్వం నుంచి గతంలో పెద్దమొత్తంలో బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వంటి కారణాలతో పనులుబాగా నెమ్మదించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడం, ఈ ఏడాది బడ్జెట్ లో ఆరు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తామని, వచ్చే ఏడాది మరో 12 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొని ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు కేటాయించడంతో పనుల పూర్తిపై ఆశలు చిగురిస్తున్నాయి.

బడ్జెట్ సరిపోదు .. నిధులు పెంచాలి : సీపీఎం డిమాండ్

‘‘ నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు ఇరవై ఏళ్లయినా పూర్తికావడం లేదు. రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు నేటికి రూ.4658 కోట్ల అంచనా వ్యయానికి చేరింది. 10 కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉంది. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 800 కోట్లు సరిపోవు, ఎక్కువ నిధులు ఇచ్చి పనుల పూర్తికి కాలపరిమితి నిర్ణయించాలి, పర్యవేక్షణ కమిటీని వేయాలి..’’ అని సీపీఎం నాయకత్వం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరింది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )