Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్-nagar kurnool cm kcr unveiling palamuru rangareddy lift irrigation project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్

Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Sep 16, 2023 05:54 PM IST

Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద మోటర్లను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్

Palamuru Rangareddy Project : తెలంగాణ సాగునీటి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభం అయింది. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్‌ పంప్‌ హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లను సీఎం కేసీఆర్ ఆన్‌ చేసి, నీటిని విడుదల చేశారు. అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

తాగు, సాగు నీటి కోసం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీటిని అందించే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో మొదలుపెట్టారు. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ఇప్పటి వరకూ 18 ప్యాకేజీల పనులను చేపట్టారు. ఈ పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాలు, 1226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు నీటితో 1546 కుంటలు, చెరువులను నింపనున్నారు.

60 రోజుల్లో 90 టీఎంసీలు

శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా కృష్ణా నది నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలు, ఆరు జలాశయాలను నిర్మించారు. దీనిలో భాగంగా తొలి పంపుహౌసులో మొదటి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంపుహౌస్‌ ఏర్పాటు చేయగా ఉపరితలంపై ఏర్పాటు చేసిన కంట్రోలింగ్‌ కేంద్రం నుంచి పంపును మీట నొక్కి నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పంపుల ఆపరేటింగ్‌ అంతా కంప్యూటర్‌ తెరపై నుంచే నిర్వహించే వీలుగా ఇంజనీరింగ్ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నీరు విడుదలయ్యేలా గేట్లు తెరుచుకోవడం, మోటారుకు విద్యుత్‌ సరఫరా.. ఇవన్నీ కంప్యూటర్‌ నుంచే పర్యవేక్షిస్తారు. ఆసియా ఖండంలోనే తొలిసారి అతి పెద్దదైన ఎత్తిపోతల పంపులను పాలమూరు ప్రాజెక్టులో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner