Musi Floods : మూసీనదికి పోటెత్తిన వరద.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్.. జాగ్రత్తగా ఉండాలన్ని జీహెచ్ఎంసీ
Musi Floods : హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర సమీపంలోని జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో.. మూసీకి వరద పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లోని మూసీ నదికి వరద పోటెత్తింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జియాగూడ, గోల్నాక, మూసారంబాగ్, చాదర్‌ఘాట్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు.
నిండు కుండల్లా..
హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి వరద నీరు భారీగా రావడంతో.. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఒక అడుగు మేర ఎత్తారు. మూసీలోకి నీటిని విడుదల చేశారు. మూసీలోకి వరద నీరు వస్తుండటంతో.. పరీవాహక ప్రాంతాల ప్రజలను డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి.
ఉస్మాన్ సాగర్ నుంచి..
ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1788 అడుగులకు నీటి మట్టం చేరింది. జలాశయంలోకి ఇన్ ఫ్లో 1600 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 226 క్యూసెక్కులు ఉంది. మొత్తం 15 గేట్లు ఉండగా.. 7, 9వ గేట్లను తెరిచి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు.
పూర్తిగా నిండిన హిమాయత్ సాగర్..
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు. ప్రస్తుతం 1761 అడుగుల నీరు ఉంది. ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కుల వస్తుండగా.. 330 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తం 17 గేట్లు ఉండగా.. ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. హైదరాబాద్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, చైతన్యపురి, చంపాపేట్, మలక్‌పేట్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, బోరబండ, మధురానగర్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరదనీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.