Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. అవసరం ఉంటేనే బయటకు రండీ.. మరోసారి మూసీ వరదలు!-heavy rain with gusty winds across hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. అవసరం ఉంటేనే బయటకు రండీ.. మరోసారి మూసీ వరదలు!

Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. అవసరం ఉంటేనే బయటకు రండీ.. మరోసారి మూసీ వరదలు!

Basani Shiva Kumar HT Telugu
Aug 31, 2024 10:17 PM IST

Hyderabad Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై వరుణుడు పంజా విసురుతున్నాడు. కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు (X)

తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలి, విద్యుత్ అధికారులు.. ఇతర విభాగాల ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిస్తే.. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసినప్పుడు నీరు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి.. వర్షపు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వెంటనే స్పందించాలి..

వర్షం కారణంగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే.. వెంటనే స్పందించాలని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సమస్య తీవ్రమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండాలి..

వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పాత భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేపించాలన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాలు కురిసినపుడు విద్యుత్ స్థంబాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

మూసీ నది వరదలు..

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. మూసీ వరదలు వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరంలో మూసీ నది పక్కన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి.. ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటు సూర్యాపేట, నల్గొండ, హుజూర్‌నగర్, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం..

వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. చాలాచోట్ల వాగులు పొంగి పోర్లుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా.. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.