Weather Report : తీరం దాటిన వాయుగుండం - ఏపీకి భారీ వర్ష సూచన, తాజా బులెటిన్ ఇదే
వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12.30-2.30 గం మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిననట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,అల్లూరి,కాకినాడ నంద్యాల,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్దమొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 5,55,250 క్యూసెక్కులుగా ఉంది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండండి - సీఎం చంద్రబాబు
వర్షాలు తగ్గేవరకు అధికారులు విశ్రమించవద్దని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరో 24 గంటలు పూర్తి అప్రమత్తత అవసరమని చెప్పారు. ఖర్చుకు వెనకాడకవద్దని...వరద బాధితులకు అన్నీ సమకూర్చాలని ఆదేశించారు.
భారీ వర్షాలపై సహాయక చర్యలపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు వరుసుగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అయినప్పటికీ అధికారులు నిరంతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
“రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఏకమయ్యాయి..అనేక జనావాసాలు జలమయం అయ్యాయి. పునరావాస చర్యల్లో ఖర్చుకు ఎక్కడా వెనకాడకండి.. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందేలా చూడండి. మంచి భోజనం, వసతి ఉండే ఏర్పాట్లు చేయండి ప్రస్తుతం జిల్లాకు రూ.3 కోట్లు ఇచ్చాం...అవసరం అయితే ఇంకా ఇస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో పలు గ్రామాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది” అని అన్నారు.
తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేసుకుని వరద నియంత్రణ చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు ఉధృతంగా ప్రవహించే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారుల సూచనలు ప్రజలు పాటించాలని.. ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఘాట్ రోడ్డు మూసివేత
అల్లూరి జిల్లాలోని చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డును మూసివేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోకి వాహన రాకపోకలను నిషేధించారు. రాజమండ్రి నుంచి చింతూరు వైపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
నూజివీడులో పెద్ద చెరువుకు గండి…
నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో పలు ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి… సహాయక చర్యలను చేపట్టారు. ఏకధాటిగా వర్షం కురవడంతో నూజివీడు పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద చెరువు గండి పడటంతో వరి పంట నీటి మునిగింది. మరోవైపు నూజివీడు బస్టాండ్‌లోకి భారీగా వర్షం నీరు చేరింది.