CM Chandrababu : భారీ వర్షాలుంటే ముందు రోజే సెలవుపై ప్రకటన, ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలుంటే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు.
CM Chandrababu : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం సమీస్తున్నారు. మరోసారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు.
రాత్రంతా మెలుకువతో పనిచేద్దాం
శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య ఇవాళ రాత్రి తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలన్నారు. రాత్రి అంతా మెలుకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పనిచేద్దామన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇప్పుడు తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది....ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నష్టం జరిగిన తరువాత స్పందించడం కాదు....నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. హుద్ హుద్ తుపాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను పాటించాలని అధికారులకు సూచన చేశారు.
"వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్నిచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. రేపు కూడా వర్షాలు పడతాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు....కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున నిధుల విడుదల చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది. ప్రోక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించాలి. నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్దప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలి. ఓపెన్ డ్రైన్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయండి." - సీఎం చంద్రబాబు
వాగులపై వాహనదారులను అనుమతించొద్దు
బుడమేరులో నీటి ఉద్ధృతి తీవ్రంగా ఉందని మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు తెలిపారు. బుడమేరు ఆక్రమణ వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. .సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల్లో, వాగులపై వాహనదారులను అనుమతించవద్దన్నారు. ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పంటకాలువలకు నీటి విడుదల నిలపివేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు.
"భారీ వర్షాలు, గాలుల వల్ల తీగలు తెగి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కరెంట్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలి. కనకదుర్గ టెంపుల్ లో ప్రమాదం విచారకరం. భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి. కొండ ప్రాంతాల్లో ఉన్నవారిని అవసరం అయితే ఖాళీ చేయించండి. పంట కాలువల్లో, డ్రైన్ లలో నీటి ప్రవాహాలకు అడ్డులేకుండా చూడండి. సైక్లోన్ షెల్టర్స్ ను సిద్ధం చేసి పునరావాసం కోసం ఏర్పాట్లు చేయండి. గర్భిణుల వివరాలు సేకరించి...అవసరమైన సాయం అందించేందుకు సిద్దంగా ఉండండి. మీడియా, సోషల్ మీడియా ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నా....అధికారుల అలసత్వం కనిపిస్తే సహించేది లేదు."- సీఎం చంద్రబాబు
పెద్దకాకాని ప్రమాదంపై ఆరా
పెద్దకాకాని ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులను వివరణ కోరారు. పాఠశాలకు సెలవు ఇవ్వలేదా? అని అధికారులను ప్రశ్నించారు. మధ్యాహ్నం తరువాత సెలవు ప్రకటించి విద్యార్థులను పంపారని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని, ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు. ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం సహాయం చేయడం కాదు....ప్రమాదం జరగకుండా చూడడంపై యంత్రాంగం దృష్టిపెట్టాలన్నారు.అధికారులు కూడా వాట్స్ యాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెప్పించుకుని వేగంగా స్పందించాలన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు స్టడీ చేయాలి....నాడు తీసుకున్న పటిష్ట, ముందస్తు చర్యల ద్వారా ప్రాణ నష్టం లేకుండా చేశామన్నారు.
సంబంధిత కథనం