AP TG Rains : ఇవాళ అత్యంత భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’-telangana likely to receive heavy to heavy rains for 2 days imd latest weather updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Tg Rains : ఇవాళ అత్యంత భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’

AP TG Rains : ఇవాళ అత్యంత భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 01, 2024 06:24 AM IST

వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అత్యంత భారీ వర్షాలు...!
అత్యంత భారీ వర్షాలు...!

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇక హైదరాబాద్ నగరంలో వర్షం ఆగటం లేదు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి.

అత్యంత భారీ వర్షాలు…!

  • ఇవాళ(సెప్టెంబర్ 1) తెలంగాణలో చూస్తే... ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
  • ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు. 

రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖాధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండేలా చూడాల‌ని సీఎస్‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. 

రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద‌ర్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీసు క‌మిష‌న‌ర్లు, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఇక శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 29.3, చిలుకూరులో 28.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెంలో 21.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

 తీరం దాటే అవకాశం..!

వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోని విశాఖపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం లోగా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. 

ఇక ఇవాళ ఏపీలో చూస్తే…. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

మరోవైపు కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,02,194 క్యూసెక్కులుగా ఉంది. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.