Heavy Rain: తెలంగాణలో దంచికొట్టిన వానలు.. 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Heavy Rain: తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి. గురువారం నాడు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అత్యధికంగా 9.3 సెం.మీటర్ల వర్షం కురిసింది. ఇటు శుక్రవారం కూడా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం హైదరాబాద్ సహా.. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 9.3 సెం.మీటర్ల వర్షం కురిసింది. ఇటు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
తెలంగాణలోని 26 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాజధానిలో ఆగమాగం..
హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. భన్సీలాల్‌పేటలో 8.7, పాటిగడ్డలో 8.5, ముషీరాబాద్‌లో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు జిల్లాల్లో కూడా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 8.7, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 6.8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.