Prakasm Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద, విజయవాడలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు
Prakasm Barrage Flood Alert: కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతలను దాటుకుని వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది.
Prakasm Barrage Flood Alert: ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది. పులి చింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక సమస్యతో వరద ప్రవాహాన్ని గుర్తించడంలో తలెత్తిన లోపాన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ అధికారులు విజయవాడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వరద హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
పులిచింతల నుంచి వరద ప్రవాహం పెరగడంతో కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వస్తున్న కారణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. పులిచింతల ప్రాజెక్ట్‌లో ఏర్పడిన సాంకేతిక ప్రమాం కారణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి వచ్చే అవకాశం ఉందని నది పరివాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరదలు హెచ్చరిక నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు ఎదుర్కొనుచున్న వివిధ సమస్యలను అధికారులకు తెలియజేసి యుద్దప్రాతిపధికన వాటిని పరిష్కరించుకొనుటకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలియజేసారు.
3 షిఫ్ట్ లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుందని కమిషనర్ వివరించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వరదల ప్రభావం కారణంగా నగర పరిధిలో ఎక్కడైనా రోడ్లపై నీటి నిల్వలు, త్రాగునీటి పైపు లైనులు లీకులు రిపైర్లు, సీజనల్ వ్యాదులు, చెట్లు విరిగి పడిపోవుట, కొండ రాళ్లు జారిపడుట, డ్రెయిన్స్ / కాలువలు పొంగిపోర్లుట వంటి సమస్యకు ఎదురైనచొ సమస్యలను నేరుగా వాట్సప్ నెం 8181960909, ల్యాండ్ లైన్ నెం. 0866-2427485, 0866-2424172, లకు కాల్స్ చేసి సమస్యలను తెలియజేయాలని సూచించారు.
ప్రజలు ఫిర్యాదు చేస్తే కంట్రోల్ రూమ్ సిబ్బంది సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
ప్రకాశం బ్యారేజీలో వరద…
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో పులిచింతల ప్రాజెక్టు వేగంగా నిండిపోతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పులిచింతల గేట్లు ఎత్తి, ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ తర్వాత కృష్ణా నదిని నిలిపి ఉంచే అవకాశాలు లేకపోవడంతో వచ్చిన నీటిని దిగువకు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రాజెక్టులోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టులోప్రస్తుతం 158 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వకు చేరింది. దిగువకు 1,08,895 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు పులిచింతల ప్రాజెక్టులో 10.65 టీఎంసీలు నీటి నిల్వ సాయంత్రం 6 గంటలకు 22.74 టీంసీలకు చేరింది. బుధవారం ఉదయానికి అది 30టిఎంసిలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.వేగంగా ప్రాజెక్టు నిండిపోతుండటంతో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేవారు.
సాగర్ నుంచి వరద కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి గేట్లనున బుధవారం ఎత్తనున్నారు. కృష్ణా డెల్టా కాల్వలకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.
శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం..
కృష్ణా బేసిన్‌లోకి ఎగువ రాష్ట్రాల నుంచి వరదల కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వ 3.71 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. 883.2 అడుగుల్లో 205.66 టీఎంసీలను నిల్వ చేరింది. శ్రీశైలంలో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి, కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూనే దిగువకు 3.72 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.
శ్రీశైలం ఎగువ బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, మల్యాల లిఫ్ట్‌కు 254 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువున సాగర్‌లోకి 3.24 లక్షల క్యూసెక్కులు చేరుతోంది.
సంబంధిత కథనం