Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం - రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ తో పాటు పలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. ఉదయం ఎండగా, ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, అమీన్‌పూర్, అమీర్‌పేట్, హైటెక్‌సిటీలో వర్షం దంచి కొడుతోంది. ఫలితంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మ్యాన్‌హాల్స్ దగ్గర నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ హెచ్చరికలను జారీ చేశారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ జిల్లాలకు హెచ్చరికలు
హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉదయం 8. 30 గంటల వరకు చూస్తే.... ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట,స మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీలోనూ వర్షాలు…
మరోవైపు ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తాజా బులెటిన్(ఆగస్టు 15) లో హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఈ వర్షాలు ఉంటాయని ఐఎండీ వివరించింది. మిగతా ప్రాంతాలతో పోల్చితే… రాయలసీమ, యానాం ప్రాంతంలో వానలు ఎక్కువగా పడే అకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. తెలంగాణలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 590 అడుగులకు చేరింది. మరోవైపు మేడిగడ్డ బరాజ్‌కు గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరదలు తగ్గాయి.