Godavari Flood Alert : గోదావరికి భారీగా వరద వచ్చే ఛాన్స్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు అలెర్ట్!-heavy rains in chhattisgarh and north telangana are likely to cause flooding in godavari ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Godavari Flood Alert : గోదావరికి భారీగా వరద వచ్చే ఛాన్స్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు అలెర్ట్!

Godavari Flood Alert : గోదావరికి భారీగా వరద వచ్చే ఛాన్స్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు అలెర్ట్!

Basani Shiva Kumar HT Telugu
Sep 09, 2024 09:48 AM IST

Godavari Flood Alert : అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. మరో రెండు రోజుల్లో అతి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి (@navin_ankampali)

బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడనం కారణంగా.. ఛత్తీస్‌గఢ్, విదర్భ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెన్‌గంగ, వైంగంగా, శబరి నదుల్లోకి భారీ వరద నీరు వస్తోంది. దీంతో వచ్చే 2 రోజుల్లో గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద మరింత పెరుగుతోంది. అటు అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రామవరం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

ఈ జిల్లాలపై ప్రభావం..

గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ముంపు ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు వరద ముప్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లాలో గోదావరి నదిలో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

స్కూళ్లకు సెలవు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు విశాఖ, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రెయిన్ అలెర్ట్..

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

Whats_app_banner