Godavari : ఉప్పొంగుతున్న గోదావరి..! భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ-water level of the godavari at bhadrachalam is constantly rising ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Godavari : ఉప్పొంగుతున్న గోదావరి..! భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ

Godavari : ఉప్పొంగుతున్న గోదావరి..! భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ

HT Telugu Desk HT Telugu
Sep 04, 2024 05:38 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ హెచ్చరించారు.

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు పెరుగుతుంది. మూడ్రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా మరోవైపు గోదావరి సైతం మెల్లగా తన ప్రతాపాన్ని చూపుతూ పరుగులు పెడుతోంది. 

ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 1.58 గంటలకు గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి మట్టం పెరగడంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి అంచనాలను గమనిస్తూ ముంపు ప్రాంత వాసులను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో ఏర్పడిన తుపానుకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేయాల్సి వచ్చింది. తాజాగా వరద ఉధృతి మెల్లగా పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది.

అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ రోహిత్ రాజు

సెల్ఫీల కోసం వాగులు, వంకలు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దన్నారు. వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయని, వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలని సూచించారు. 

భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం సూచించిన సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజల రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.