Godavari Floods: మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. నేటి ఉదయానికి అంటే బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 42.10 అడుగులకు ఎగబాకింది. 43 అడుగులకు నీటి మట్టం చేరిందంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఓవైపు అధికారులు, మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 36.7 అడుగులకు చేరుకుంది. కాగా నేటి ఉదయానికి అంటే బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 42.10 అడుగులకు ఎగబాకింది.
43 అడుగులకు నీటి మట్టం చేరిందంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు. గత నెలలో ఏర్పడిన తుపాను సమయంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. అయితే అధికారుల అప్రమత్తతతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
కాగా తాజాగా మళ్లీ గోదావరి పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా గత తుపాను సమయంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి భారీగా పంట నష్టపోయిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ నిర్మిస్తున్న రింగ్ బండ్ సైతం ఈ వర్షానికి కొట్టుకుపోయింది.
మళ్ళీ పెరుగుతున్న తాలిపేరు
తాలిపేరు ప్రాజెక్టు వరద మళ్ళీ పెరగడం ప్రారంభించింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 40 మీటర్లకు చేరుకుంది. కాగా గోదావరి నది ఉధృతి రీత్యా పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.
కిన్నెరసాని పరుగు...
భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు తర్వాత మరో ప్రాజెక్ట్ గా ఉన్న పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు. క్రమంగా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి