Godavari Floods : ఎగువ నుంచి భారీగా వరదతో గోదావరి ఉగ్రరూపం- ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
Godavari Floods : ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
Godavari Floods : వరదలు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. పై నుంచి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ ను దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికి వరదలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ), కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. వాల్గొండ నుంచి కాళేశ్వరం వరకు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ కడెం ప్రాజెక్టుల నుంచి ఐదు లక్షలకు పైగా నీటిని గోదావరి లోకి విడుదల చేయగా క్యాచ్ మెంట్ ఏరియా నుంచి వస్తున్న వరదతో దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. స్నానఘట్టాలు, శ్రాద్ధ మండపం నీటమునిగాయి. సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరింది.
ధర్మపురి దిగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ధర్మపురి ముంపునకు గురి కాకుండా ఉండేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 6 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గోదావరిఖని, మంథని వద్ద పుష్కర ఘాట్లు నీట మునిగాయి. తీరంలోని ఆలయాలకు గోదావరి జలాలు తాకాయి.
పార్వతి, సరస్వతి బ్యారేజ్ భారీగా వరద
పైన ఉన్న ఎస్సారెస్పీ, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్ల వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ కి వరద పోటెత్తింది. ఆరున్నల లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో బ్యారేజ్ కి చెందిన మొత్తం 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళు వచ్చినట్లు దిగువన గోదావరి లోకి వదిలారు. ఆ వాటర్ అన్నారం సమీపంలోని సరస్వతి బ్యారేజ్ కి చేరుకుంది. సరస్వతి బ్యారేజ్ గేట్లన్ని ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఆ వరద అంతా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం లో కలిసి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు చేరుతుంది. లక్ష్మి బ్యారేజ్ గేట్లు అన్ని ఎత్తడంతో అక్కడ ఏడున్నర లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి లో ప్రవహిస్తుంది.
గోదావరి ఉద్ధృతితో అధికారులు అప్రమత్తం
గోదావరి వరద ఉద్ధృతితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్ లు సత్యప్రసాద్, కోయ శ్రీ హర్ష ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో మకాం వేసి వరద పరిస్థితిని సమీక్షించారు. పై నుంచి ఎంత వరద వస్తే అంత నీటిని దిగువకు వదలి పెట్టేలా చర్యలు చేపట్టారు. నదీ తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ధర్మపురిలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చర్యలు చేపట్టామని లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ధర్మపురిని ముంచెత్తకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తామని, వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తేలా అధికారులను ఆదేశించామని చెప్పారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. వరదలతో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి వైపు అనవసరంగా ఎవరు వెళ్లవద్దని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.