Bhadrachalam : నీట మునిగిన భద్రాచలం పట్టణం - ఆలయ పరిసరాల్లోకి చేరిన నీరు!-bhadrachalam temple and several areas submerged in godavari flood water ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam : నీట మునిగిన భద్రాచలం పట్టణం - ఆలయ పరిసరాల్లోకి చేరిన నీరు!

Bhadrachalam : నీట మునిగిన భద్రాచలం పట్టణం - ఆలయ పరిసరాల్లోకి చేరిన నీరు!

HT Telugu Desk HT Telugu
Aug 07, 2024 02:11 PM IST

Rains in Bhadrachalam : భారీ వర్షాల దాటికి భద్రాచలం తడిసిముద్దవుతోంది. పట్టణంలోని పలు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీల్లో ఇళ్లు నీటి మునిగిపోయాయి.

నీట మునిగిన భద్రాచలం పట్టణం
నీట మునిగిన భద్రాచలం పట్టణం

Rains in Bhadrachalam : దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం పట్టణం భారీ వర్షాలకు నీట మునిగింది. మంగళవారం రాత్రి కురిసిన వానకి శ్రీ రాముని ఆలయం చుట్టూ నీరు చేరింది. గోదావరి నది బ్యాక్ వాటర్ కి తోడు భారీ వర్షపు నీరు తోడవ్వడంతో భద్రాద్రి పట్టణంలోకి వరద నీరు దూసుకొస్తోంది. 

ప్రస్తుతం 33 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయిన సమయంలో కూడా పట్టణంలోకి నీరు చేరలేదు. కానీ ప్రస్తుతం బ్యాక్ వాటర్ పట్టణంలోకి వచ్చి చేరుతుంది. దీంతో రామాలయం పరిసర ప్రాంతాలు మొత్తం నీటితో మునిగాయి.

 ఆలయంలోని అన్నదాన సత్రం చుట్టూ వరద నీరు చేరింది. విస్తా కాంప్లెక్స్ వద్ద దుకాణాల్లోకి నీరు చేరింది. గోదావరి కరకట్ట సూయిజ్ లు మూసి వేయడంతో నడుముల లోతు నీరు చేరింది. దేవాలయ పరిసర కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇరిగేషన్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భద్రాచలం పట్టణం నీట మునిగే పరిస్థితి దాపురించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా మంత్రులు ఆదేశించినా పెడ చెవిన పెట్టిన కారణంగానే ప్రఖ్యాతిగాంచిన శ్రీ రాముని ఆలయానికి, భద్రాచలం పట్టణానికి ఈ దుర్భర స్థితి దాపురించినట్లు తెలుస్తోంది.

మంత్రుల ఆరా..

భద్రాచలం పట్టణంలోకి నీరు చేరుతున్న విషయంపై జిల్లాకు చెందిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని వారు అధికారులను ఆదేశించారు. బాహుబలి మోటార్ల ద్వారా నీటిని నదిలోకి ఎత్తి పోయాలని సూచించారు. అయితే మోటార్లు సరిగా పని చేయకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.