Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద 53 అడుగులకు గోదావరి వరద, మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. వరద ప్రవాహం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Bhadrachalam Godavari : భద్రాచలంలో గోదారమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. తగ్గినట్లే తగ్గి మరింతగా పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకుంది. గడిచిన వారం రోజుల్లో మూడు సార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయగా తాజాగా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి ప్రవహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మేడిగడ్డ నుంచి భారీగా వరద నీరు
గోదావరి నది ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలకు గత నాలుగు రోజులుగా మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి దాదాపు తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అలాగే ఇంద్రావతి, తాలిపేరు, జంపన్న వాగు, పెద్దవాగు, తదితర వాగులు ఉప్పొంగడం వల్ల గత నాలుగు రోజుల నుంచి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి 50.70 ఫీట్లకు చేరువగా ప్రవాహం వస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం భద్రాచలంలోని వరద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగినదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్ స్పష్టం చేశారు. శనివారం గోదావరి వరద ఉద్ధృతి పెరగడంతో వరద ముంపునకు గురయ్యే కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అశోక్ నగర్ గ్రామాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి నన్నపనేని స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించినట్లు వివరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ముంపు కాలనీల ప్రజలు గోదావరి వరదల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తమ కాలనీలకు గోదావరి వరద తాకిడి వచ్చిన వెంటనే వరదల కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందిస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు
గోదావరి వరద పెరుగుతున్నందున ఎటపాక వాగు గత 20 రోజుల నుంచి మూసి వేయడం వల్ల భద్రాచలం చుట్టు పక్కల గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తూరుబాక వాగు వెనుకకు తట్టి, కొత్త కాలనీ వాగులోకి కలవడం వల్ల నీటి ప్రవాహం శనివారం భారీగా పెరిగింది. కొత్త కాలనీ వాగుకు దాదాపు 190 హెచ్పీ మోటార్స్ బిగించినప్పటికీ వాటి సామర్థ్యం దాటి నీరు చేరుకుందని, ఈ నీటి మునక ఇంకా రెండు మూడు రోజులు ఉండే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు రోజులు భారీ వర్ష సూచన కారణంగా పరిసర ప్రాంతాలైన కొత్తకాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ వాసులు పరిస్థితి అర్థం చేసుకొని లోతట్టు ప్రాంత వాసులు ఎగువ సురక్షిత ప్రాంతమైన నన్నపనేని స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలి వెళ్లవలసిందిగా ఆదేశిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది వారికి సహకరించాలని ఆయన సూచించారు. ఈ సహాయక చర్యల్లో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ భూపేందర్రావు, పంచాయతీ ఈవో శ్రీనివాస్ సిబ్బంది తలమునకలవుతున్నారు. మరోవైపు చింతూరు, వెంకటాపురం మండలాలకు భద్రాచలం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం