Dhavaleswaram Barrage : ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Dhavaleswaram Barrage : ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Dhavaleswaram Barrage : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గత వారం రోజులుగా హెచ్చు తగ్గుల ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పెరుగుతుండడంతో...బ్యారేజీ గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద పోటు క్రమంగా పెరుగుతుందని...గోదావరి సమీపంలోని కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి ఉద్ధృతి పెరుగుతుండడంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి నది ప్రస్తుతం 51.80 అడుగులతో ప్రవహిస్తోంది. గడిచిన రెండు రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ గోదావరి దోబూచులాడుతోంది. అయితే ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో మొత్తం మూడు పర్యాయాలు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం గమనార్హం. దీంతో అటు అధికారులు, ఇటు ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మళ్లీ లోతట్టు ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి. స్థానిక ఎటపాక వాగు పొంగడం వల్ల లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలోని 36 కుటుంబాలను భద్రాచలం నన్నపనేని హై స్కూల్ లోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఎటపాక వాగు బ్యాక్ వాటర్ ను ఇరిగేషన్ అధికారులు 90 హెచ్ఆర్ మోటార్ల ద్వారా ఎత్తి పోసే కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రెండు మోటర్లు మరమ్మత్తుకు గురయ్యాయి. నాలుగు మోటర్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. రిపేరుకు గురైన మోటార్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తున్నారు. రిపేరు అయిన వెంటనే మొత్తం ఆరు మోటర్లతో 24 గంటల పాటు వరద నీటిని ఎత్తిపోయనున్నాయి.
శ్రీశైలం వద్ద వరద ఉద్ధృతి
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం 08 గంటల రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 863.4కు చేరింది. నీటినిల్వ 111.94 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 2,36,442 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్ నిండడానికి మరీ ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
సంబంధిత కథనం