Bhadrachalam Godavari Flood : భద్రాద్రి గోదావరి మళ్లీ ఉగ్రరూపం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
Bhadrachalam Godavari Flood : భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 51.80 అడుగులతో...రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి.
Bhadrachalam Godavari Flood : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రస్తుతం 51.80 అడుగులతో ప్రవహిస్తోంది. గడిచిన రెండు రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ గోదావరి దోబూచులాడుతోంది. అయితే ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో మొత్తం మూడు పర్యాయాలు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం గమనార్హం. దీంతో అటు అధికారులు, ఇటు ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మళ్లీ లోతట్టు ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి. స్థానిక ఎటపాక వాగు పొంగడం వల్ల లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలోని 36 కుటుంబాలను భద్రాచలం నన్నపనేని హై స్కూల్ లోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఎటపాక వాగు బ్యాక్ వాటర్ ను ఇరిగేషన్ అధికారులు 90 హెచ్ఆర్ మోటార్ల ద్వారా ఎత్తి పోసే కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రెండు మోటర్లు మరమ్మత్తుకు గురయ్యాయి. నాలుగు మోటర్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. రిపేరుకు గురైన మోటార్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తున్నారు. రిపేరు అయిన వెంటనే మొత్తం ఆరు మోటర్లతో 24 గంటల పాటు వరద నీటిని ఎత్తిపోయనున్నాయి.
ఎటపాక లోతట్టు ప్రాంతాల్లో మునక
వరద నీరు భారీగా రావడం వల్ల బ్యాక్ వాటర్ ను పంపుల ద్వారా గోదావరిలోకి పంపడం కష్టతరమవుతుంది. గోదావరి వరద తగ్గే అవకాశం ఉన్నందున, వరద నీటిమట్టం తగ్గాక పూర్తి స్థాయిలో నీరు ఎత్తి పోస్తారు. కొంతమంది వ్యక్తులు పంపులు నడపకపోవడం వల్ల ప్రజల నివాస స్థలాల్లోకి నీరు వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. సంఘటన స్థలంలో భద్రాచలం ఆర్డీవో, పోలీసు సిబ్బంది, పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నరని కలెక్టర్ తెలిపారు. మరో వైపు రెడ్డిపాలెం - సారపాక మధ్యలో ప్రధాన రహదారి పైకి గోదావరి వరద నీరు చేరుతోంది. దీంతో ఈ దారిలో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా గోదావరి వరద మరింత పెరుగుతుండటంతో చుట్టుపక్కల మండలాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం