Krishna Godavari Updates : శ్రీశైలంలో 863 అడుగులు దాటిన నీటిమట్టం, ఔట్ ఫ్లో షురూ! మళ్లీ పెరిగిన గోదావరి ఉద్ధృతి-the water level crossed 863 feet in srisailam project latest updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Krishna Godavari Updates : శ్రీశైలంలో 863 అడుగులు దాటిన నీటిమట్టం, ఔట్ ఫ్లో షురూ! మళ్లీ పెరిగిన గోదావరి ఉద్ధృతి

Krishna Godavari Updates : శ్రీశైలంలో 863 అడుగులు దాటిన నీటిమట్టం, ఔట్ ఫ్లో షురూ! మళ్లీ పెరిగిన గోదావరి ఉద్ధృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 27, 2024 09:05 AM IST

Krishna Godavari River Updates : కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం ఉదయం నాటికి శ్రీశైలం జలాశయ నీటిమట్టం 8603 అడుగులు దాటింది. మరోవైపు గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది.

శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)
శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)

Krishna Godavari River Updates: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది.

ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం (జులై 27) ఉదయం 08 గంటల రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 863.4కు చేరింది. నీటినిల్వ 111.94 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 2,36,442 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరీ ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

సాధారణంగా భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు.. భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణా నది తీర ప్రాంత అందాలను చూసేందుకు క్యూ కడుతున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఇలా…..

ఇక నాగార్జున సాగర్ లో చూస్తే శనివారం ఉదయం 8 గంటల రిపోర్ట్ ప్రకారం …. 506.6 గా నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 125.97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 36,937 గా ఉండగా… 6,453 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 103.02 అడుగుల నీటిమట్టం ఉంది. 1.04 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 350 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది.

గోదావరి వరద ఉధృతి:

మరోవైపు గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 50.9 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులుగా ఉండగా… మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది. అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070,112,18004250101 నెంబర్లు సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

NOTE : ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గణాంకాలు మారుతుంటాయి. ఆ వివరాలను https://apwrims.ap.gov.in/mis/reservoir/ లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చు.

Whats_app_banner