Godavari Floods : శాంతించిన గోదావరి...! భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
పరవళ్లు తొక్కుతూ భయానక స్థితి కల్పించిన గోదారమ్మ ఎట్టకేలకు సాధారణ స్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా హమ్మయ్య..! అంటూ ముంపు ప్రాంతాల జనం ఊపిరి పీల్చుకునే రీతిలో వరద గండం తప్పింది.
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో భయం గుప్పిట్లో కాలం గడిపిన ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాద్రి వద్ద గోదావరి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం(21/07/24) మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్న గోదావరి, సోమవారం (22/07/24) మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు పెరగడంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ మంగళవారం (23/07/24) ఉదయం 8 గంటలకు 51.60 అడుగుల స్థాయికి చేరుకుంది. అనంతరం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నిలకడగా ప్రవాహం మారగా, ఉదయం 11 గంటల నుంచి నెమ్మదిగా తగ్గుతూ సాయంత్రం 8 గంటలకు 1.70 అడుగులు తగ్గి 49.9 అడుగులు మేర ప్రవహించింది.
శాంతించిన గోదావరి….
బుధవారం పూర్తిగా శాంతించిన స్థితిలో గోదావరి ప్రవాహం సాగుతోంది. ఉదయం 06:00 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 47.4అడుగులకు చేరుకున్నట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలియజేశారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాగా మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా నేటి సాయంత్రానికి గోదావరి నది ప్రవాహం సాదారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటుతుందని అధికారులు భావించిన నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నష్ట నివారణా చర్యల్లో అధికారులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు వరద ఉధృతి తగ్గింది. కిన్నెరసానికి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుకుంది.
తాలిపేరు ప్రాజెక్టునకు 21,524 క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా, 25 గేట్లు ఎత్తి 22,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మంగళవారం ఉదయం గోదావరి ప్రవాహం పెరగడం కారణంగా దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రవాణా స్థంభించింది. గోదావరి తగ్గుముఖం పట్టాక రాకపోకలు యాథావిధిగా సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో వరద నీటి ప్రవాహం తగ్గిందని, ప్రస్తుతం అందుబాటు ఉన్న గణాంకాల ఆధారంగా గోదావరి సాదారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం