Bhadrachalam Godavari: భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం,తెలంగాణలో విస్తారంగా వర్షాలు, వెంటాడుతున్న ముంపు భయం
Bhadrachalam Godavari: భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం 46.4 అడుగులను దాటింది. భద్రాచలం వద్ద గోదావరి ఎంతకీ తగ్గుముఖం పట్టడం లేదు. అంతకంతకూ పెరుగుతూ ఉగ్ర రూపం దాలుస్తోంది.
Bhadrachalam Godavari: గోదావరి ఉగ్రరూపంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం 5 గంటలకు 46.4 అడుగులకు గోదారి నదీ ప్రవాహం చేరుకుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఆదివారం సాయంత్రం అధికారులు జారీ చేశారు.
ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 44 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యుసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత 10 గంటలకు 44.4 అడుగులకు చేరి గోదారి తన ప్రవాహ ప్రతాపాన్ని చూపింది. 11 గంటల సమయంలో 44.8 అడుగులకు చేరిన గోదావరి వరద సోమవారం ఉదయం 5 గంటలకల్లా 46.4 అడుగులకు ఎగబాకింది.
గడిచిన రెండు రోజులుగా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుందే తప్ప ఏ క్షణాన కూడా తగ్గినట్లు రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ ప్రవాహం 48 అడుగులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు స్పష్టం చేస్తున్నారు. గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
గత అనుభవాలను సృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం సోమవారం కూడా తుపాను ప్రభావం ఉండనుంది. దీంతో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ ల నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం గోదావరికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దీంతో గంటల వ్యవధిలోనే భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగా కొద్ది గంటల్లోనే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు..
గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా మారింది. మరోవైపు రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం ఆదివారం అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా-ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని ఐఎండి వివరించింది.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.