Mla Surgery: చుట్టూ గోదావరి వరద, గర్భిణీలకు సిజేరియన్‌తో పురుడు పోసిన భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు
Mla Surgery: చుట్టూ గోదావరి వరద ప్రవాహం, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలకు ఆ ప్రాంత ఎమ్మెల్యే అత్యవసర శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శస్త్రచికిత్సలు చేయడంపై స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.
Mla Surgery: గోదావరి వరదలు పోటెత్తడం, పోలవరం బ్యాక్ వాటర్‌తో ఏజెన్సీ ప్రాంతాలు వరద ప్రవాహంలో చిక్కుకుని విలవిల లాడుతున్నాయి. ఏజెన్సీలో నాలుగైదు రోజులుగా అత్యవసర చికిత్సలు కూడా అందడం లేదు. ఈ క్రమంలో మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే అత్యవసర శస్త్ర చికిత్సలు చేసి ఇద్దరు మహిళలకు పురుడు పోశారు.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవ వేదన పడుతున్న ఇద్దరు గర్భిణులకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేసే వైద్యులు ఎవరు లేరు. గైనకాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. అక్కడ పనిచేసే వైద్యులు ఇటీవల బదిలీ కావడం, కొత్త వారిని నియమించక పోవడంతో ఆస్పత్రిలో చేరిన మహిళలు వారి బంధువులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ఆదుకున్నారు.
వృత్తి రీత్యా వైద్యుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావు 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున భద్రాచలంలో పోటీ చేసి గెలిచారు. గత మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి వరదలతో ఏజెన్సీ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం డెలివరీ తేదీలు సమీపించిన గర్భిణులను ముందే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అయిదుగురు సర్జన్లు ఉండాలి. వీరిలో నలుగురు కొద్ది రోజుల క్రితమే బదిలీ అయ్యారు. కొత్త వారిని నియమించలేదు. ఆసుపత్రి సూపరింటెం డెంట్ సర్జన్ అయినా, కోర్టు కేసులో హాజరు కావాల్సి ఉండటంతో దాని కోసం వెళ్లారు. మంగళవారం ఆసుపత్రిలో ఉన్న గర్భిణుల్లో ఇద్దరికి పురిటి నొప్పులు రావడంతో ఉన్న సిబ్బంది సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించారు.
వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉండటంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వారిని వేరే ఆస్పత్రికి తరలించాలన్నా వరద ప్రభావంతో అది సాధ్యం కాలేదు. దీంతో శస్త్రచికిత్సల్లో నిపుణుడైన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు.
వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రికి వచ్చి గర్భిణులిద్దరికీ సిజేరియన్ చేశారు. వీరిలో దుమ్ముగూడెం మండలం డబ్ల్యూ రేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్న రెండో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. 3కిలోల 250గ్రాముల బరువుతో చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడు.
చర్ల మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన పిల్లి పుష్పలీల రెండో కాన్పులో ఆడబిడ్డను ప్రసవించింది. రెండున్నర కిలోల బరువుతో చిన్నారి ఆరోగ్యంగా ఉంది. అత్యవసర చికిత్సలు చేసి గర్భిణీల ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యేను.. గర్భిణీల బంధువులు పొగడ్తలతో ముంచెత్తారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గతంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేశారు. సివిల్ సర్జన్‌గా గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేశానని, ఏరియా ఆస్పత్రిలో ఒక్కరే సర్జన్ ఉండటంతో, వైద్యుడిగా తాను స్పందించానని ఎమ్మెల్యే చెప్పారు. ఆంధ్రా, తెలంగాణల నుంచి ఏరియా ఆస్పత్రికి చికిత్సల కోసం వస్తుంటారని ఎమ్మెల్యే శస్త్ర చికిత్సల తర్వాత చెప్పారు. గైనకాలజిస్ట్‌గా సాయంగా ఉండటం తన బాధ్యతగా భావించానని వివరించారు.
గతంలో శస్త్ర చికిత్సల నిపుణుడిగా భద్రాచలం ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చిన వెంటనే సర్జరీలకు ఏర్పాట్లు చేయాలని సూచించి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి అనస్తీషియా వైద్యుడు మల్లేష్, గైనకాలజిస్ట్‌లు గర్భిణీలను సర్జరీలకు సిద్ధం చేశారు. ఆస్పత్రి సిబ్బంది చూపించిన చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.