Godavari Flood Manual : ఇప్పటికీ అవే అంచనాలు, గోదావరి వరద మ్యాన్యువల్ నవీకరణ ఎప్పుడు?-khammam godavari floods manual updates need of the hour due to polavaram back water effect ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Godavari Flood Manual : ఇప్పటికీ అవే అంచనాలు, గోదావరి వరద మ్యాన్యువల్ నవీకరణ ఎప్పుడు?

Godavari Flood Manual : ఇప్పటికీ అవే అంచనాలు, గోదావరి వరద మ్యాన్యువల్ నవీకరణ ఎప్పుడు?

HT Telugu Desk HT Telugu
Jul 23, 2024 10:05 PM IST

Godavari Flood Manual : గోదావరి పరివాహక ప్రాంతంలో వరద తీవ్రతను అంచనా వేసేందుకు గోదావరి వరద మాన్యువల్ కీలకం. అయితే 1953 నుంచి 70 ఏళ్లుగా వరదల పరిస్థితులను పొందుపర్చారు. అయితే పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో మాన్యువల్ ను నవీకరణ చేయాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఇప్పటికీ అవే అంచనాలు, గోదావరి వరద మ్యాన్యువల్ నవీకరణ ఎప్పుడు?
ఇప్పటికీ అవే అంచనాలు, గోదావరి వరద మ్యాన్యువల్ నవీకరణ ఎప్పుడు?

Godavari Flood Manual : గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వరదల తీవ్రతను అంచనా వేసేందుకు గోదావరి వరద మాన్యువల్ ఒక దిక్సూచి లాంటింది. అధికారికంగా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1953 నుంచి ఇప్పటి వరకు ఏడు దశాబ్దాలుగా గోదావరి ప్రవాహం తీరు, అత్యధిక నీటిమట్టాలు, ముంపు పరిస్థితి, నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలు ఇందులో పూర్తిగా పొందుపర్చారు. అయితే ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం, బూర్గంపాడు పరిసర ప్రాంతాలపై స్పష్టంగా పడుతోంది. ఫలితంగా గతంలో రూపొందించిన గోదావరి వరద మాన్యువల్ ను నవీకరణ చేయాలనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఇది ప్రస్తుత పరిస్థితులకు ఎంతో అవసరమనే వాదన వినిపిస్తోంది.

1984లో తొలిసారిగా రూపకల్పన

గోదావరి వరద మాన్యువల్ ను 1984లో తొలిసారిగా రూపిందించారు. అనంతరం 1986 ఆగస్టు 16న వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టం భద్రాద్రి చర్రితలోనే అత్యధికం కావడంతో దాని ఆధారంగా అధికారులు తొలిసారిగా 1987లో మార్పులు చేశారు. 1968 గోదావరి వరదలను బెంచ్ మార్క్ గా గుర్తించి 1990, 1994, 1995, 1998, 2000, 2002, 2006 సంవత్సరాలలో వచ్చిన వరదలను పరిగణలోకి తీసుకొని 2007లో రెండోసారి గోదావరి మాన్యువల్ ను నవీకరించారు.

తాజాగా నవీకరణ ఎప్పుడు?

2022 జులైలో వచ్చిన గోదావరి వరదలు గత 32 ఏళ్లలో భద్రాచలం ఏజెన్సీ వాసులు ఎన్నడూ చూడనివి. 1900లో 70.8 అడుగుల నీటిమట్టం భద్రాచలం వద్ద నమోదు కాగా 2022 జూలై 16న భద్రాచలం వద్ద గరిష్టంగా 71.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఫలితంగా వంద గ్రామాలు వ్యవసాయపరంగా ప్రభావితం కాగా 78 గ్రామాలు ముంపు బారినపడ్డాయి ఈ వరదలతో భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, మణుగూరు, పినపాక అశ్వాపురం మండలాలు అతలాకుతలమయ్యాయి. దీనికి పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావమే కారణమని సాగు నీటి రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా 2022 వరదలను ప్రాతిపదికన చేసుకొని పోలవరం బ్యాక్ వాటర్ ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై శాస్త్రీయ గణాంకాలను పరిగణలోకి తీసుకొని గోదావరి వరద మాన్యువల్ ను నవీకరణ చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం