Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి-రెండో ప్రమాద హెచ్చరిక జారీ-bhadrachalam godavari floods second warning announced water level reached 48 feet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి-రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి-రెండో ప్రమాద హెచ్చరిక జారీ

HT Telugu Desk HT Telugu
Jul 22, 2024 02:48 PM IST

Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద అంతకంతకూ గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 48.1 అడుగులకు చేరుకుంది.

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి-రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి-రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam Godavari Floods : గడిచిన రెండు రోజులుగా గంట గంటకూ పెరుగుతూ గోదావరి ఉగ్ర రూపాన్ని చూపుతోంది. తాజాగా భద్రాచలం వద్ద 48.1 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని (43 అడుగులు) దాటిన గోదావరి సోమవారం తెల్లవారాక 5 గంటల సమయంలో 46.4 అడుగుల స్థాయిని చేరింది. అయితే ఆదివారం ఉరకలు పెట్టిన గోదారి సోమవారం మాత్రం మెల్లగా పెరుగుతోంది. 12 గంటల వరకు 47.8 అడుగులుగా ఉన్న నీటి మట్టం ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ 2 గంటలకు 48.1 అడుగులకు చేరుకుంది. నేటి రాత్రికి 49 నుంచి 51.20 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల వద్ద ప్రవాహం అధికంగా ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్దకు సెల్ఫీలు దిగడానికి, చేపలు పట్టడానికి ఎవరు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. సరదాల కోసం పిల్లలు, యువకులు ఫొటోల కోసం, ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విపత్కర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేసి తక్షణమే పోలీసు వారి సహాయం పొందాలని తెలియజేసారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు చేపట్టే చర్యలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే ఏమవుతుంది?

భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటితే భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని నీటిపారుదలశాఖ ప్రకటించింది. 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని సూచించింది. 2022లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ మట్టం స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటిపారుదలశాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు.

నీటిపారుదల శాఖ వెబ్సైట్ ఆధారంగా

వాస్తవానికి వరద ప్రవాహం 48 అడుగులకు చేరిన తర్వాతే తీవ్రత మొదలవుతుంది. గోదావరి వరద ఉద్ధృతమయ్యే కొద్దీ దుమ్ముగూడెం మండలంతో పాటు భద్రాచలం పట్టణానికే ఎక్కువ ముంపు పొంచి ఉంది. స్లూయిజ్ ల నుంచి వచ్చే బ్యాక్ వాటర్ కారణంగా రామాలయ పరిసర ప్రాంతాలకు సైతం వరద విస్తరిస్తుంది. 48-53 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 13 గ్రామాలు, భద్రాచలం ప్రభావితమవుతాయి. 53-58 అడుగుల మధ్య చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని 48 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 63 నుంచి 68 మధ్య ఆరు మండలాల్లోని 85 గ్రామాలు, 73 అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలం, 109 గ్రామాలు ముంపు బారినపడనున్నాయి. మండలాల వారీగా చూస్తే చర్లలో 26, దుమ్ముగూడెంలో 51, బూర్గంపాడులో 5, అశ్వాపురంలో 11, మణుగూరులో 6, పినపాకలో 10 గ్రామాలకు వరద గండం ఉంటుంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

Whats_app_banner

సంబంధిత కథనం