AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, నదుల ఉద్ధృతి దృష్ట్యా...ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అల్లూరి జిల్లాలో 4 మండలాల్లో రెండ్రోజులు సెలవు ప్రకటించారు.
AP Schools Holiday : ఏపీలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. అలాగే అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ లోని 4 మండలాల్లోని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ దినేశ్ కుమార్ ప్రకటించారు. పాడేరు డివిజన్ లో మాత్రం సోమవారం స్కూళ్లు తెరుస్తారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ సి.నాగరాణి సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గోదావరి నది ఉద్ధృతి, వరదల దృష్ట్యా సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అలాగే సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో వర్షాలు
వాయుగుండం ప్రభావంపై ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది. వర్షాలకు వాగులు, వంకలు, నదలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను ఆనుకుని ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతుందని పేర్కొంది. రానున్న 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సంబంధిత కథనం